ఐ లవ్ ఒంగోల్ పోలీస్ : ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్

Entertainment Published On : Sunday, February 9, 2025 02:30 PM

దర్శకుడు రాంగోపాల్ వర్మను తనదైన రీతిలో ట్వీట్లు చేస్తూ తన తిక్కను నిరూపిస్తూ ఉంటారు. పొగిడినట్లే పొగిడి అందులో ఎటకారాన్ని మేళవించటం వర్మకు మాత్రమే సాధ్యం. అదురుబెదురు లేని రీతిలో ఆయన వ్యవహరించే తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారని లేకుండా బరితెగింపునకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే ఆయనకు చట్టాలు సైతం క్రమశిక్షణ నేర్పించకపోవటం చూసినప్పుడు వర్మ మేధావితనానికి ముచ్చట పడాల్సిందే.

వ్యూహం చిత్ర ప్రచార సమయంలో నాటి విపక్ష నేతలు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్ చేసిన కేసులో రాంగోపాల్ వర్మను ఒంగోలు గ్రామీణ సీఐ ఎన్. శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరైన విషయం తెలిసిందే. విచారణ ముగించుకొని స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఆయనో ట్వీట్ చేశారు. 'ఐ లవ్ ఒంగోల్. అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్, త్రీ ఛీర్స్' అంటూ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. ఒక కేసుకు సంబంధించిన విచారణకు హాజరై తిరిగి వెళ్లే వేళలో ఈ తరహా ట్వీట్ పెట్టటం ఇప్పటివరకు ఏ ప్రముఖుడు ఇలాంటి ట్వీట్లు చేయలేదు.