ఉదయం లేవగానే తలనొప్పా.. ఇలా చేయండి..

Lifestyle Published On : Tuesday, February 4, 2025 06:00 AM

కొందరికి ఉదయం లేవగానే తలనొప్పిగా ఉంటుంది. అది కూడా తల బద్దలయ్యేంత నొప్పి. ఉదయాన్నే తలనొప్పితో నిద్రలేవడం వల్ల మనకు అసౌకర్యంగా అనిపించడంతోపాటు మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. అయితే తలనొప్పికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఉదయం నిద్రలేవగానే తలనొప్పికి డీహైడ్రేషన్‌ ఒక కారణంగా చెప్పొచ్చు. రాత్రిపూట సరిపడ నీరు తాగకుండా నిద్రపోతే ఇలాంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిద్ర నాణ్యత లేకపోవడం, ఒత్తిడి కూడా ఇందుకు కారణం అవ్వచ్చు. వారం వారం షిఫ్ట్ మార్చి పనిచేసే వారిలో ఇలాంటి తలనొప్పి సాధారణంగా వస్తుంది. స్లీప్‌ అప్నియాతో బాధపడేవారిలో కూడా తలనొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కునే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

గురకతో ఇబ్బందిపడే వారిలో కూడా తలనొప్పి వస్తుందని చెబుతున్నారు. ఇటువంటి తలనొప్పి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది దాదాపు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే నొప్పికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. పొద్దున్న లేచిన వెంటనే గ్లాసు మంచి నీళ్ళు తాగడం వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమస్య ఉన్నవారు రాత్రి వేళ కెఫిన్ ఉన్న టీ, కాఫీ, చాక్లెట్లు వంటివి కాకుండా ఒక గ్లాసు నీరు తాగి పడుకోండి. రాత్రంతా టీవీలు, మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లు చూసి నిద్రించే అలవాటును తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చెయ్యాలి. అలాగే ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకోకూడదు. తలనొప్పితో పాటూ వికారం, వాంతులు, తల తిరగడం, దృష్టిలోపం వంటి ఇతర ఇబ్బందికరమైన లక్షణాలు ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.