కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలో తెలుసా..
ఎండాకాలంలో హైడ్రేషన్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో తోడ్పడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు చాలా హెల్ప్ అవుతుంది. అయితే, కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం కూడా ముఖ్యం. శరీరానికి ప్రయోజనాలు అందాలంటే కొబ్బరి నీళ్లు సరైన సమయంలో తీసుకోవాలి..
ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విషమలినాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లు ఉదయాన్నే తాగడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. సాధారణంగా వ్యాయామం తర్వాత శక్తి క్షీణిస్తుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు మంచివని నిపుణులు అంటున్నారు. అవి వ్యాయామం తర్వాత శరీరానికి తక్షణ హైడ్రేషన్, శక్తిని అందిస్తాయి. కొబ్బరి నీళ్లు కండరాల అలసటను కూడా తగ్గిస్తుంది.
వేసవిలో మధ్యాహ్నం కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇది నిర్జలీకరణం, హీట్ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. వేసవిలో మధ్యాహ్న సమయాల్లో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. తినడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. తినడానికి అరగంట ముందు కొబ్బరి నీళ్లు తాగండి. బరువు తగ్గాలనుకునేవారు తినడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీనివల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఎక్కువ తినాలన్న కోరిక ఉండదు.
జ్వరం, విరేచనాలు లేదా వాంతులు వంటి సమయాల్లో కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. దీని వల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్ల లోపం భర్తీ అవుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. శరీరం త్వరగా కోలుకోవడానికి సాయపడుతుంది.