ప్రతి రోజూ తప్పక చేయాల్సిన వ్యాయామాలు
రోజూ వ్యాయామం చేయడం వల్ల సమయానికి తగ్గట్టుగా ఆకలి వేస్తుంది. దీంతో పాటు నిద్రలేమి సమస్య కూడా దూరమై పోతుందని హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేస్తే గుండె సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయట. వీటితో పాటు డిప్రెషన్, డయాబెటిస్, హార్ట్ అటాక్ లాంటివి దూరమవుతాయి.
వ్యాయామంలో భాగంగా రోజూ వాకింగ్ చేయడం చాలా మంచిది. కీళ్ల నొప్పులు, ఊబకాయం లాంటి సమస్యలకు వాకింగ్ చాలా మంచిది. ఆర్థ్రైటిస్ లాంటి కీళ్లకు సంబంధించిన వ్యాధులను పోగొట్టుకోవాలంటే నడక చాలా ముఖ్యం. రోజూ నడవడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గిపోతుంది. వెయిట్ మేనేజ్ మెంట్ కీ వాకింగ్ అవసరం. ఉదయం పూట జాగింగ్ చేస్తే రోజంతా బాడీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. కొంత మంది నాలుగు రోజులు వాకింగ్ చేసి ఆ తరవాత బద్దకిస్తారు. రేపు వెళ్లొచ్చులే అని రోజూ వాయిదా వేస్తుంటారు. ఇలా వాయిదాలు వేయకుండా క్రమం తప్పకుండా వాకింగ్ కి వెళ్తే చురుగ్గా ఉంటారు. దీంతో పాటు మెడిటేషన్ చాలా కీలకం. ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉత్తమమైన మార్గం. ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడేందుకు, ప్రశాంతంగా కాసేపు గడిపేందుకు ధ్యానం తప్పనిసరి. ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. కనీసం 15 నుంచి 20 నిముషాల పాటు ధ్యానం చేస్తే చాలా వరకూ ఒత్తిడి తగ్గిపోతుంది.
రోజూ ఏరోబిక్ చేయాలని హార్వర్డ్ వర్సిటీ నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుందని వెల్లడించారు. రోజూ కార్డియో ఎక్సర్ సైజ్ చేయడం తప్పనిసరి. ఇది క్రమంగా తప్పకుండా చేస్తే గుండెతో పాటు ఊపిరి తిత్తులు కూడా యాక్టివ్ గా మారిపోతాయి. తద్వారా శరీరంలోని అన్ని కణాలకు ఆక్సిజన్ అందుతుంది. సైక్లింగ్, జాగింగ్, స్విమింగ్, స్క్వాట్స్ లాంటివి చేస్తే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కచ్చితంగా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాకే కార్డియో చేయాలి. ఈ మధ్య కొంత మంది జిమ్ లలో కార్డియో చేస్తూ కుప్ప కూలిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫిట్ నెస్ పెంచుకోవాలన్న హడావుడిలో గుండెపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. ఇది ప్రాణాలకే ప్రమాదం. పరిమితికి మించి బరువులు ఎత్తడం లాంటివీ మానేయాలి. ఏదైనా ట్రైనర్ సూచనల మేరకు నడుచుకోవాలి.