ఆలస్యంగా భోజనం చేస్తే ఎంత ప్రమాదమంటే..

Lifestyle Published On : Thursday, February 27, 2025 07:40 AM

కొందరు ఆలస్యంగా భోజనం చేయడం లేదా రాత్రిపూట అల్పాహారం మాత్రమే తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లు మీ శరీర సహజ ప్రక్రియలను దెబ్బతీస్తాయి. దీనివల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అంతేకాదు బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

2024లో జరిపిన పరిశోధనల ప్రకారం రాత్రి భోజనం త్వరగా చేసేవారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. రక్తంలో చక్కెర నియంత్రణ, జీవక్రియ పనితీరు కూడా మెరుగ్గా ఉందని తేల్చారు. లేటుగా, అస్తవ్యస్తమైన సమయాల్లో భోజనం చేసే వారి కంటే వీరు బరువును బాగా నియంత్రించుకోవచ్చని వెల్లడించింది. సాయంత్రం 6 లేదా 7 గంటలలోపు డిన్నర్ ముగించేవారు ఇతరుల కంటే యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంటున్నారని ఈ పరిశోధనలో తేలింది. రాత్రి 7 గంటలలోపు రాత్రి భోజనం ముగించడం ఆరోగ్యకరమైనదిగా నిపుణుల సూచిస్తున్నారు. అయితే, ఇది కుటుంబం, మనం చేసే పనివేళలు వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేయడం కుదరని వారు వారు తీసుకునే ఫుడ్ లో కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే రాత్రి మనం రెస్ట్ తీసుకునే సమయం. ఉదయం పూట శ్రమించే పనుల వల్ల ఎక్కువ కేలరీలు శరీరానికి అవసరం అవుతాయి. కానీ, రాత్రి కొద్దిపాటి కేలరీలు కలిగిన భోజనం తీసుకోవడం బెటర్ అంటున్నారు. తృణధాన్యాలు, పిండి పదార్థాలు కలిగిన కూరగాయలు, నాన్-స్టార్చ్ కూరగాయలు, లీన్ ప్రోటీన్లు కలిగినవి భోజనంలో భాగం చేసుకోవాలి.

చాలా మంది భోజన సమయానికి ముందు స్నాక్స్ తీసుకుంటుంటారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే మీ ఆహారపు అలవాట్లపై తీవ్ర నష్టం కలిగిస్తుంది. మీరు భోజన సమయానికి ముందు చిరుతిండ్లు మానుకోవాలి. లేదంటే అవి మీరు తినే సమయంలో ఆకలిని తగ్గించేస్తాయి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందకుండా చేస్తాయి. భోజనానికి బదులుగా టిఫిన్లతో కడుపు నింపుకోవడం కూడా సరికాదు. అన్ని రకాలు పోషకాలైన కూరగాయలు, పప్పులతో కూడిన భోజనం చేయడం ఎంతో అవసరం.

పడుకునే ముందు తీసుకునే ఆహారం మీ మొత్తం ఆరోగ్యాన్ని, నిద్రను ప్రభావితం చేస్తుంది. కెఫిన్ కలిగిన ఆహారాలను, చాక్లెట్లు, టీ, సోడా కలిసినవి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా డ్యామేజ్ చేస్తాయి. వీటితో పాటు వేయించిన ఆహారాలు, మసాలాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి కూడా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు.