శ్రీశైలం ప్రొజెక్ట్ కి భారీ వరద, గేట్లు ఎత్తివేత..
ఎగువ రాష్ట్రాల లో భారీ వర్షాల వలన కృష్ణమ్మకు నీటి ప్రవాహం భారీగా పెరగడంతో నాలుగు గేట్ల ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం(2019 సెప్టెంబర్ 20) సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయం నీటిమట్టంతోపాటు నీటి నిల్వలు గరిష్టస్థాయికి చేరాయి. ఎగువ జూరాల నుంచి 78,860 క్యూసెక్కులు, తుంగభద్ర ద్వారా 31,122 క్యూసెక్కులు, హంద్రీ ద్వారా 250 క్యూసెక్కులతో కలిపి శ్రీశైలం జలాశయానికి 1,10,432 క్యూసెక్కుల నీరు చేరుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుం 884.90 అడుగులుగా ఉండగా. నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టిఎంసిలు కాగా ప్రస్తుతం 215.3263 టిఎంసిలుగా నమోదయింది.
అలాగే ఆనకట్ట నుంచి 4 నాలుగు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి సాగర్‌కు 1,12,116 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు కెనాల్కు 5 వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 1688 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. రెండు విద్యుత్ కేంద్రాల నుంచి గత 24 గంటల్లో 32,090 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు, కుడి గట్టు జల విద్యుత్ కేంద్రం నుంచి 25,855 క్యూసెక్కులను వినియోగించి దిగువ సాగర్‌కు 68,233 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఆనకట్టపై నాలుగు గేట్ల ద్వారా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా, బ్యాక్‌వాటర్ నుంచి మొత్తం కలిపి 1,89,437 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.