అలా చేస్తే జైలే దిక్కు: సీఎం చంద్ర‌బాబు

News Published On : Friday, December 20, 2024 08:30 PM

భూములు కబ్జా చేస్తే జైలే దిక్కు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా, పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఈడుపుగ‌ళ్లు గ్రామంలో శుక్ర‌వారం జ‌రిగిన రెవెన్యూ స‌ద‌స్సులో ఆయన పాల్గొన్నారు. ప్ర‌జ‌ల నుంచి రెవెన్యూ స‌మ‌స్య‌ల‌కు సంబంధించి పిటిషన్ల‌ను స్వ‌యంగా స్వీక‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు.

57 శాతం ఓట్ల‌తో గొప్ప మెజారిటీతో గెలిపించి ఎన్‌డీఏ ప్ర‌భుత్వంపై మీరు పెట్టుకున్న ఆశ‌ల‌ను నెర‌వేర్చేందుకు ఆర్నెళ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నామ‌ని.. ఇంకా కష్ట‌ప‌డ‌తామ‌ని, ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించాల‌నేది మా ఆలోచ‌న అని ముఖ్య‌మంత్రి అన్నారు. "గ‌త ప్ర‌భుత్వం భూక‌బ్జాలతో మొదలుపెట్టి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ నిర్వీర్యం చేసింది. విధ్వ‌సం సృష్టించారు. మ‌న జీవితాల‌ను అంధ‌కారంలోకి నెట్టారు. గ‌తంలో ఎప్పుడూ ఇన్ని ఇబ్బందులు చూడ‌లేదు. ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల ఆశ‌ల మేర‌కు ప‌నిచేసే ప్ర‌భుత్వం ఇద‌ని స్ప‌ష్ట‌మైన హామీ ఇస్తున్నా. ఒక‌వైపు అవినీతి.. మ‌రోవైపు వ్య‌వ‌స్థ‌ల విధ్వంసం.. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయ‌డం.. ఇలా అనేక స‌మ‌స్య‌ల‌ను సృష్టించారు.

ఇప్ప‌టివ‌ర‌కు ల‌క్షా 57 వేల 481 అర్జీలు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇంటి జాగా కోసం 9,830 వినతులు, ల్యాండ్ గ్రాబింగ్‌కు సంబంధించి 9,528 ఫిర్యాదులు వ‌చ్చాయి. ఇవికాకుండా గ‌వ‌ర్న‌మెంట్ భూమి కోసం 8,366 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆక్రమణలకు సంబంధించి 8,227 వ‌చ్చాయి. అధికార యంత్రాంగంపైన ఫిర్యాదులు 8 వేలు వ‌చ్చాయి.  22ఏ ద్వారా అక్ర‌మాల‌కు పాల్పడ్డారు. ప‌ట్టా భూములను క‌బ్జాచేశారు. ఒక‌టి రెండు కాదు కొన్ని వంద‌ల కేసులు జ‌రిగాయి. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత నేను ఒక్క‌టే నిర్ణ‌యించుకున్నాను. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్య‌త తీసుకొని ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నామ‌ని" ముఖ్య‌మంత్రి అన్నారు.