ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న ప్రభుత్వం.. అర్హతలు ఇవే..

News Published On : Monday, January 27, 2025 10:10 PM

ఎన్నికల సమయంలో ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ దిశగా చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు.

ఈ పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ఉత్తర్వుల్లో తెలిపారు. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలాన్ని మహిళల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇంటి పట్టా వచ్చిన రెండేళ్లలోనే అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకు మాత్రమే ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇవ్వనుంది. ఇంటిస్థలం పట్టా వచ్చినవాళ్లకి పదేళ్ల తర్వాతనే ఆ స్థలంపై వారికి పూర్తిగా హక్కులు ఉంటాయి. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్ డీడ్ జారీ చేయనున్నారు. లబ్ధిపొందబోయే వారికి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటిస్థలం ఉండకూడదు సొంత ఇల్లు కూడా ఉండకూడదని ప్రభుత్వం షరతులు పెట్టింది. గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లో కూడా లబ్ధిదారుగా ఉండకూడదని పేర్కొంది. రేషన్ కార్డు ఉండాలి. 5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లోపు మగాణి ఉండాలి. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం త్వరలోనే దరఖాస్తులు స్వీకరించనుంది.