హైవే నిర్మాణం కోసం ఇంటికి 2 కోట్ల ఆఫర్.. చివరికి యజమాని ఏం చేశాడంటే..

News Published On : Monday, January 27, 2025 09:00 AM

చైనాలోని షాంఘైకి సమీపంలోని జిన్సీ పట్టణంలో హైవే నిర్మాణం సాగుతోంది. అందరూ ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ హువాంగ్ పింగ్ అనే వృద్ధుడు మాత్రం తన ఇంటిని వదిలి వెళ్లడానికి ఒప్పుకోలేదు. ప్రభుత్వం భారీ నష్టపరిహారం ఇచ్చినా ససేమిరా అన్నాడు. దీంతో రోడ్డు నిర్మాణ కార్మికులు ఆయన ఇంటి చుట్టూనే రోడ్డు వేశారు. ఇప్పుడు ఆ ఇల్లు హైవే మధ్యలో ఒంటరిగా దీపంలా వెలుగుతోంది. 

ఇప్పుడు మాత్రం పింగ్ తన నిర్ణయం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాడు. "నేను సమయాన్ని వెనక్కి తిప్పగలిగితే, కచ్చితంగా ప్రభుత్వం ఆఫర్‌ను అంగీకరించేవాడిని. ఇప్పుడు ఇది పెద్ద పందెం ఓడిపోయినట్టు ఉంది" అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. చాలానే బాధగా ఉంది అని వాపోతున్నాడు

ప్రభుత్వం మిస్టర్ పింగ్‌కు మొదట 1.6 మిలియన్ యువాన్లు (భారతీయ కరెన్సీలో రూ.1.9 కోట్లు), రెండు స్థలాలను ప్రభుత్వం ఆఫర్ చేసింది. ఆ తర్వాత మరో స్థలాన్ని కూడా కలిపి మొత్తం మూడు స్థలాలను ఇస్తామని చెప్పింది. కానీ, ఆ ఆఫర్ తనకు నచ్చలేదని ఆయన తిరస్కరించాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన ఇల్లు హైవే మధ్యలో చిక్కుకుపోయింది. ఇంటికి వెళ్లాలంటే ఒక పెద్ద పైపు గుండా వెళ్లాల్సి వస్తోంది. ఆయన ఇంటి పైకప్పు రోడ్డుకు దాదాపు సమాన ఎత్తులో ఉంది. నిర్మాణం జరుగుతున్న సమయంలో దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మిస్టర్ పింగ్ తన 11 ఏళ్ల మనవడితో కలిసి రోజంతా పట్టణ కేంద్రంలోనే ఉంటున్నారు. రాత్రి నిర్మాణం ఆగిపోయాక ఇంటికి తిరిగి వస్తున్నారు. హైవే తెరుచుకున్నాక నిరంతరం వాహనాల రాకపోకలతో వచ్చే శబ్ద కాలుష్యం తమ ప్రశాంత జీవితానికి పెద్ద ఆటంకం కలిగిస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు.