రైతులను రెచ్చగొట్టిన దీప్ సిద్దూ ఎవరు, బీజేపీకి అతనికి సంబంధం ఏంటి ?
New Delhi, January 26: రిప్లబిక్ డే రోజున ఎర్రకోట ముట్టడికి సూత్రధారి పంజాబీ గాయకుడు, నటుడు దీప్ సిద్థూ అని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఆయనే రైతులను రెచ్చగొట్టి ఎర్రకోట దిశగా మరల్చాడని, ఓ యువకుణ్ణి ఉసిగొల్పి సిక్కు మత జెండాను ఎగరేసేట్లు చేశాడని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) హరియాణ విభాగం నేత గుర్నామ్ సింగ్ చదౌనీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఇండస్ సరిహద్దు నుంచి తరిమికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ట్రాక్టర్ ర్యాలీని కేవలం ఢిల్లీ సరిహద్దుల మీదుగా తీసుకెళతామని హామీ ఇస్తూ, రైతు సంఘాలు అనుమతి తీసుకోగా, నిన్న పరిస్థితి మరోలా మారిపోయిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ హింసకు కారణం దీప్ సిద్ధూనేనని, ఆయన స్వయంగా ముందుకు కదులుతూ రైతులను రెచ్చగొట్టారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. అతను రైతుల ప్రతినిధి కాదని, అసలు రైతు కూడా కాదని అంటున్న నేతలు, ఉద్యమం పక్కదారి పట్టడానికి ఆయనే కారణమని మండిపడ్డారు. నిన్న అల్లర్లు ప్రారంభం కాగానే దీప్ సిద్ధూతో రైతులు వాగ్వాదానికి దిగారని, ఢిల్లీలోకి ట్రాక్టర్లను ఎందుకు దారి తీయించావని రైతులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది.
రైతు సంఘాల భేటీల్లో, ఆందోళనల్లో ఆయనకు స్థానం ఇవ్వలేదు. ఎర్రకోట వద్ద హింస జరిగినపుడు అతనక్కడే ఉన్నాడు’ అని స్వరాజ్ ఇండియా అభియాన్ నేత యోగేంద్ర యా దవ్ తెలిపారు. నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్జేఎఫ్)తో దీప్‌కు సంబంధాలున్నాయని, ఆ సంస్థ ఆదే శం మేరకే ఈ పని చేయించడాని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.
ఆపై ఈ ఉదయం రైతుల నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. రైతుల ఆగ్రహాన్ని తట్టుకోలేక పోయిన ఆయన, తన వాహనంలో సరిహద్దులను వదిలి పారిపోయారు. ఇండస్ సరిహద్దుల నుంచి ఆయన వాహనం వెళుతుంటే, దానిపై కర్రలు, చెప్పులు విసరడం కనిపించింది. కాగా, నిన్న జరిగిన అల్లర్ల కేసులో ఇప్పటికే పోలీసులు 15 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీప్ సిద్ధూను సాధ్యమైనంత త్వరలో అదుపులోకి తీసుకుని విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఎర్రకోటపై తమ జెండాను ఎగురవేసిన తరువాత, సిద్ధూ ఫేస్ బుక్ ద్వారా లైవ్ లోకి వచ్చి, ఆ దృశ్యాలను చూపిస్తూ, రైతులను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో దీప్ సిద్ధూ అక్కడే ఉన్నారనడానికి సాక్ష్యాలు లభించడంతో, ఈ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని, అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.
దీప్ సిద్దు బయోడేటా ఇదే..
పంజాబ్‌లోని ముక్తసర్లో 1984లో పుట్టిన దీప్ సిద్దూ కింగ్ ఫిషర్ మోడల్‌గా ఎంపికై ఆ తరువాత సినీరంగంలోకి ప్రవేశించారు. ఈ మోడల్ ను తొలుత హీరోగా సుప్రసిద్ద బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర పరిచయం చేశారు. రామ్తా జోగి అనే సిన్మాలో నటించాక ఆయన 2019 ఎన్నికల్లో ధర్మేంద్ర కుమారుడైన సన్నీ దేవళ్ తరఫున గురుదాస్‌పూర్‌లో బీజేపీకి ప్రచారం చేశారు. ఆ తరువాత రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి వివిధ మార్గాలను వెతుక్కుంటూ ఈ ఆందోళనను తన ఎదుగుదలకు ఓ ఆలంబనగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కొందరు బీజేపీ నాయకులకు ఆయన చాలా సన్నిహితుడని ప్రచారం సాగుతోంది.
2019లో ఆయన ప్రధాని మోదీతో దిగిన ఫోటోను సుప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరలై సంచలనం రేపింది. రైతుల ఆందోళనను దెబ్బ తీయడానికి బీజేపీయే ఈ కుట్రకు పాల్పడిందని విమర్శలు రేగాయి. కాగా, విధ్వంసకర పరిణామాలకు కారణం... కిసాన్ మజ్దూర్ సంఘర్షణ కమిటీ అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 41 యూనియన్ల ఐక్య వేదిక కిసాన్ మోర్చాతో విభేదించి ఈ సంఘర్షణ్ కమిటీ ఘాజీపూర్ సరిహద్దుల వద్ద నుంచి ఢిల్లీ దిశగా కదిలింది.
నిర్దేశిత మార్గాలను ఉల్లంఘించి ముందుకు సాగాలని రైతులకు పిలుపునిచ్చి అనేక చోట్ల ఉద్రిక్తతలకు కారణమైనట్లు రైతు నేతలు అంటున్నారు. ఈ సంఘం విధ్వంసకర మార్గాన్ని ఎంచుకోవడం వల్ల దీప్ సిద్ధూ పని సులువైందని, ఆయన ఈ యూనియన్ సభ్యులను ఎర్రకోట వైపు మరల్చాడని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఎర్రకోట వద్ద ఓ ఫ్లాగ్ పోల్ పై పతాకాన్ని తానే ఎగురవేశానని పంజాబీ నటుడు దీప్ సిద్దు అంగీకరించాడు. ఈ స్తంభంపై ‘నిషాన్ సాహిబ్’ పతాకాన్ని తను ఎగురవేశానని, కానీ జాతీయ పతాకాన్ని మాత్రం తొలగించలేదని, అది దేశ సమైక్యత, సమగ్రతలకు చిహ్నమని ఆయన అన్నాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో ఈ విషయాలు తెలియజేస్తూ.. మన దేశ సమగ్రత, సమైక్యతలను ఎవరూ ప్రశ్నించజాలరన్నాడు.
రెడ్ ఫోర్ట్ వద్ద రైతులను తానే రెచ్ఛగొట్టినట్టు వఛ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. నేను గానీ, నా సహచరులు గానీ నేషనల్ ఫ్లాగ్ ని ముట్టుకోలేదని, కానీ ఆ ఘటన జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నది వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇది ముందుగా వేసుకున్న పథకం కాదన్నాడు. దీనికి ఎలాంటి మతపరమైన రంగు పులమరాదని దీప్ సిద్దు కోరాడు. నిషాన్ సాహిబ్ అంటే అది సిక్కుల మతపరమైన చిహ్నమని, అన్ని గురుద్వారాలపైనా ఈ పతాకం కనిపిస్తుందని ఆయన వెల్లడించాడు.
హింసకు ప్రేరేపించినది నేనే అని యూనియన్ నేతలు చెప్పడాన్ని ఖండిస్తున్నా... ఇది ఒక్కరి పని కాదు. రెండు నెలల నుంచి రైతుల ఆందోళన సాగుతోంది. ఆవేశకావేశాలు మిన్నంటాయి. ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నపుడు నేనే చేశానని ఎలా నిందిస్తారు?’ అని ఆ వీడియో పోస్ట్‌లో దీప్ ప్రశ్నించారు.
కాగా రైతుల ఆందోళన సందర్భంగా ఓ రైతు మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఐటీవో వద్ద పోలీసుల బుల్లెట్ తగిలి అతడు మృతి చెందాడని రైతులు ఆరోపిస్తుండగా, ట్రాక్టర్ పైనుంచి పడి ఆ రైతు మృతి చెందాడని పోలీసులు అంటున్నారు. తాజాగా, ఢిల్లీ పోలీసులు ఆ రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల చేశారు. ట్రాక్టర్ పల్టీ కొట్టిన కారణంగానే ఆ రైతు మరణించినట్టు ఆ వీడియో ఫుటేజి ద్వారా పోలీసులు వెల్లడించారు. అతివేగంగా బారికేడ్ల వైపు దూసుకొచ్చిన ఆ ట్రాక్టర్ బోల్తాపడినట్టు తేలింది. కాగా, ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ ముగియడంతో రైతులు తమ ట్రాక్టర్లతో సహా తిరిగి ఘజియాపూర్ చేరుకున్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ల ర్యాలీగా ఢిల్లీకి వస్తున్న రైతు నేతలకు నగరంలో పలుచోట్ల స్థానికులు పూలవర్షం కురిపించారు. వారికి స్వాగతం పలుకుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. కొన్ని చోట్ల డప్పులు, వాయిద్యాల మోతలతోనూ స్వాగతించారు. కాగా.. ఓవైపు గణతంత్ర దినోత్సవాలు, మరోవైపు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడంతో దేశ రాజధాని మంగళవారం భద్రతా దళాలతో నిండిపోయింది. 6 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు అంచనా.
కాగా, రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబె విద్యార్థి ఆశిష్ రాయ్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కు లేఖ రాశారు. ర్యాలీలో సంఘవిద్రోహక శక్తులు చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అత్యున్నతమైన మువ్వన్నెల పతాకం ఎదుట ఒక సమూహానికి చెందిన వారి జెండా ఎగరడం, దేశ గౌరవాన్ని దెబ్బతీసిందని రాయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో ట్రాక్లర్ల ర్యాలీ కేంద్రానికి తెలియజేసిన రైతులు తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పించబడిన రోజు ఫిబ్రవరి 1 న వివిధ ప్రాంతాల నుండి పార్లమెంటు మార్చ్ (Farmer Leaders Announce March) నిర్వహిస్తామని నిరసన చేస్తున్న రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు దానికే కట్టుబడి ఉన్నామని క్రాంతికారి కిసాన్ యూనియన్‌కు చెందిన దర్శన్ పాల్ అన్నారు. వారి డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 1 న బడ్జెట్ రోజున (Budget Day 2021) వివిధ ప్రాంతాల నుండి కాలినడకన పార్లమెంటు వైపు వెళ్తాము "అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఉద్యమం జరిగినట్లే ఈ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.“ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు ఇప్పుడు వెనక్కి వెళ్లరు. తరువాత నిరసనలో (Parliament March) పాల్గొంటారు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది. మా వైఖరి అలాగే ఉంది, ”అని పాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిరసనను తీవ్రతరం చేయడానికి రైతుల ప్రణాళికలను పంచుకున్నారు.