ప్రభుత్వానికే జయలలిత ఆస్తులు.. మొత్తం ఎంతంటే..

News Published On : Saturday, February 1, 2025 12:30 PM

తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత పేరు వినని వారు ఎవరూ ఉండరు. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకున్నారన్న కేసులో దోషిగా తేలటంతో రాజకీయ విమర్శలు, అనేక కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో 2016లో అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే, ఆమె మరణించిన సమయంలో ఎన్నో ఆస్తులు వివరాలు, బ్యాంకు బ్యాలెన్స్ గురించి చర్చకు వచ్చింది. తాజాగా బెంగళూరు సిబీఐ కోర్టు జయలలితకు ఆస్తులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. 

జయలలితకు చెందిన 1,562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు, వజ్రాభరణాలు, 11 వేలకు పైగా పట్టు చీరలు, 750కి పైగా ఖరీదైన చెప్పులు, గడియారాలు, ఇతర వస్తువులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ఆస్తులు, వస్తువులు తమకు చెందాలంటూ జయలలిత వారసులుగా చెబుతున్న జె.దీపక్, జె.దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. సుమారు దశాబ్దం క్రితం తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ. 913 కోట్లు అని తెలిపింది. ప్రస్తుతం వాటి మార్కెట్‌ విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.