మహాత్మా గాంధీ ఫోటోలతో మద్యం బాటిళ్లు

News Published On : Saturday, February 15, 2025 04:00 PM

బీరు బాటిల్ పై గాంధీజీ ఫొటోలు ఉన్న పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్యన్ బీరు బ్రాండ్ రివోర్ట్ బాటిల్ పై గాంధీజీ చిత్రాలు కనిపించాయి. రష్యన్ బ్రాండ్ రివోర్ట్ హేజీ ఐపీఏ అనే బీర్ క్యాన్లపై గాంధీజీ ఫొటోలు, ఆటోగ్రాఫ్ కనపడడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ ఫొటోలను సోషల్ మీడియా నుంచి తీసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల దేశాన్ని కించపరచడమే అవుతుందని మండిపడ్డారు. తక్షణం ఈ బ్రాండ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 ప్రధాని మోదీ ఈ ఘటనపై జోక్యం చేసుకుని చిత్రాలను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని శ్రీ సుపర్ణో సప్తతీ అనే సామాజిక కార్యకర్త ఎక్స్ వేదికగా ప్రధాని మోదీని కోరారు. 2018లోనూ ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ జరుగుతున్న సమయంలో రష్యాలోని ఓ బార్ లో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేరుతో ఉన్న బీర్ తాగుతూ కొందరు కనిపించారు. అంతకుముందు కూడా అమెరికాకు చెందిన ఓ కంపెనీ తమ బీర్ క్యాన్స్ మీద గాంధీజీ చిత్రాలు అతికించారు. ఈ ఘటనపై హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ ఘటనపై ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.