గోరంట్ల మాధవ్ ఎఫెక్ట్.. 11 మంది పోలీసులు సస్పెండ్
పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడిన కేసులో oనిందితుడు, వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు కోర్టులో హాజరుపర్చే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయను నియమించారు. మాధవ్‌ను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పడు అక్కడ ఆయన ఫోన్‌లో మాట్లాడినా బందోబస్తు సిబ్బంది అడ్డు చెప్పలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవటానికి నిరాకరించి, తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నెర చేశారు.
కోర్టు వద్ద పోలీస్ వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్సైలు, సిబ్బంది నుంచి డీఎస్పీ భానోదయ వాంగ్మూలాలు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చినా అక్కడున్న పోలీసులు పట్టించుకోకపోవడానికి కారణాలేంటీ? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆరా తీశారు.
మాజీ ఎంపీని నల్లపాడు స్టేషన్ నుంచి జీజీహెచ్‌కు వైద్య పరీక్షలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి, తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్సై, ఇతర సిబ్బందిని డీఎస్పీ భానోదయ విచారించారు. ఈ నివేదిక ఆధారంగా 11 మంది పోలీస్ సిబ్బందిపై గుంటూరు రేంజ్ ఐజీ వేటేశారు. గోరంట్ల మాధవ్ అరెస్ట్‌లో నిర్లక్ష్యంగా ఉన్న 11 మంది పోలీస్ అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు ఉన్నారు. అదే విధంగా మరో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు.