అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్: ఆరుగురు అరెస్ట్

News Published On : Sunday, December 22, 2024 08:03 PM

హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కి చెందిన పలువురు విద్యార్థులు నిరసనకి దిగారు. వారంతా ఒక్కసారిగా బన్నీ ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అంటూ నినాదాలు చేశారు.

అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్న కుండీలను పగలగొట్టారు. అలాగే బలవంతంగా ఇంట్లోకి చొరబడే ప్రయత్నాలు కూడా చేశారు. రేవతి కుటుంబానికి కోటి రూపాయల పరాహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే సమయంలో కొందరు అత్యుత్సాహం చూపించారు. అల్లు అర్జున్ ఇంటి పైకి రాళ్లు విసరడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా ఆందోళనకు గురైంది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు ఓయూ జేఏసీ నాయకులను అరెస్టు చేశారు. దాడి సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని ఆరా తీస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ప్రస్తుతం భారీగా పోలీసులు మోహరించారు.