వైసీపీలో ఎంట్రీకి సీబీఐ మాజీ జేడీ రెడీ, నియోజకవర్గం ఫిక్స్, జగన్ కేసులపై ఇలా ..!
ఏపీలో కొత్త రాజకీయాలు తెర మీదకు వచ్చాయి. పవన్ కళ్యాణ్‌తో గత ఎన్నికల్లో కలిసి పని చేసి జనసేన వీడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు కొత్త రాజకీయ వేదిక వైపు చూస్తున్నారు. జనసేన నుండి విశాఖ లోక్ సభ స్థానానికి మాజీ జేడీ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జనసేనలో రాజకీయంగా మాత్రం క్రియాశీలకంగా లేరు. ఇక, స్వచ్చంద సంస్థ ద్వారా ప్రధానంగా రైతుల సేవల పైనా ఫోకస్ చేసిన ఆయన కొంత కాలంగా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. కరోనా సమయంలో ప్రధాని మోడీ సేవలను ఆయన అభినందించటంతో ఆయన బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదన పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే, దీనిని లక్ష్మీనారాయణ ఖండించారు.
సీబీఐ జేడిగా ఉన్న సమయంలో లక్ష్మీ నారాయణ జగన్ పైన కేసులు అన్నీ దగ్గర ఉండ పర్యవేక్షించేవారు. ఆ సమయంలో ఆయన టీడీపీకి మద్దతుగా నిలిచే పత్రికలకు జగన్ కేసుల విచారణ వివరాలను లీక్ చేసే వారని జగన్ పైన ద్వేషంతో వ్యవహరిస్తున్నారని అప్పట్లో విమర్శించేవారు. ఇక, లక్ష్మీనారాయణ 2014 ఎన్నికల సమయంలోనే రాజకీయల్లోకి వచ్చి టీడీపీ నుండి పోటీ చేయాలని భావించారని టీడీపీ నేతలే చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల్లో లక్ష్మీనారాయణ టీడీపీ నుండి పోటీ చేస్తే అప్పటికే తన పైన కక్ష్య సాధింపులో భాగంగానే కేసులు నమోదు చేశారని జగన్ అండ్ కో ప్రచారం సాగించింది. ఆ సమయంలో సీబీఐ జేడీ టీడీపీ నుండి పోటీ చేస్తే అది జగన్ కు అనుకూలంగా మారుతుందనే ఆలోచనతో టీడీపీ నేతలే ఆయనను మరి కొంత కాలం వేచి చూడాలని సూచించారు. ఆయన జనసేనలో చేరి అనూహ్యంగా విశాఖ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పవన్ తిరిగి సినిమాల్లోనూ నటించాలనే నిర్ణయంతో మాజీ జేడీ జనసేన వీడి బయటకు వచ్చారు. ఇక, అప్పటి నుండి ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం మొదలైంది.
వచ్చే ఎన్నికల్లో తాను మరో సారి ఎంపీగానే పోటీ చేస్తానని మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరోక్షంగా తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన తనకు మూడు లక్షల ఓట్లు వచ్చాయని..విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని తన భవిష్యత్ స్థానం తేల్చి చెప్పారు. వైసీపీలోకి వచ్చేందుకు పరోక్షంగా సంసిద్దత వ్యక్తం చేసిన లక్ష్మీనారాయణ తనకు విశాఖ ఎంపీ సీటు కావాలనే విషయాన్ని ఇప్పటి నుండే ఇంజెక్ట్ చేయటం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.