ప్రజల ముందుకి వచ్చిన కిమ్ , అనారోగ్య ప్రచారానికి చెక్..
ఉత్తరకొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ చేసిన ఓ ప్రకటనపై ప్రపంచ దేశాలు చర్చించుకుంటున్నాయి. శనివారం ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రజల ముందుకి వచ్చారనీ రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లోని ఓ నిర్మాణం పూర్తైన ఎరువుల కర్మాగారాన్ని సందర్శించి, అక్కడి వేడుకల్లో పాల్గొన్నారని తెలిపింది. అందువల్ల కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారనే ప్రచారానికి చెక్ పెట్టినట్లైంది.
ఏప్రిల్ 11న కిమ్ చివరిసారి ప్రపంచానికి కనిపించారు. ఆ తర్వాత ఆయన కనిపించకపోవడం, కీలకమైన వేడుకల్లో కూడా పాల్గొనకపోవడం, కిమ్ కి సంబంధించిన అంశాలను ఆయన సోదరి నడిపిస్తుండటంతో ప్రపంచ మీడియా అనుమానం వ్యక్తం చేసింది. కిమ్ జోంగ్ ఉన్‌కి హార్ట్ సర్జరీ తర్వాత తీవ్ర అనారోగ్యం ఏర్పడిందని కథనాలు ఇచ్చింది. దానికి తోడు గత వారం చైనా నుంచి కొందరు డాక్టర్లు ఉత్తర కొరియా వెళ్లడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఏప్రిల్ 11న కరోనా వైరస్‌పై జరిగిన అధికార పార్టీ చర్చలో కిమ్ పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కనిపించలేదు. తాజాగా ఆయన ప్రజల ముందుకి రావడంతో ఇక ఊహాగానాలకు తెరపటినట్లే అనుకోవచ్చు.