విశాఖ కైలాసగిరిలో భారీ అగ్నిప్రమాదం, భయంతో పరుగులు పెట్టిన స్థానికులు
విశాఖపట్నంలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. చెత్త తగలబడటంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. దీంతో కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏమవుతుందోనంటూ భయంతో పరుగులు తీశారు. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం ఈ అగ్ని ప్రమాదం (Kailasagiri Fire Accident) జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అయితే, కైలాసగిరిపై వ్యాపారస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. శుక్రవారం పాత టైర్లను తగలబెట్టడంతోనే మంటలు అంటుకున్నట్టు పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. భద్రతను గాలికి వదిలేసినట్టు తెలిపారు.