3 వేల మంది ఉద్యోగులను వెళ్లగొట్టనున్న టెక్ దిగ్గజ సంస్థ
ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్లను తొలగించిన విషయం మార్చచిపోక ముందే టెక్ దిగ్గజం మెటా (Meta) భారీగా ఉద్యోగులను ఇంటికి పంపడానికి సిద్ధమవుతోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీల మాతృ సంస్థ మెటా, ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టనున్నట్లు సమాచారం. అదే రోజు అమెరికాతో సహా చాలా దేశాలలో సోమవారం స్థానిక సమయం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్ లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా కోతల నుంచి మినహాయింపు లభిస్తుంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియ కింది సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా ఇప్పటికే వెల్లడించింది.
ఇప్పుడు చెప్పినట్లుగానే తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనుంది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఉద్యోగుల తొలగింపు మొదలు పెడితే ఆ ప్రభావము 5 శాతం లేదా సుమారు 3600 మంది మీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేఆఫ్స్ కారణంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని జూకర్ బర్గ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.