భారత్, పాక్ సరిహద్దులో కాల్పులు, జవాన్ల మృతి..!

News Published On : Saturday, August 17, 2019 04:50 PM

జమ్మూ, కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. భారత్, పాక్ జవాన్ల ఎదురు కాల్పుల్లో ఒక భారత్ జవాన్ మరణించగా నలుగురు పాకిస్థాన్ సైనికులు మరణించారని సమాచారం. ఎల్ ఓసీలో భారత్- పాకిస్థాన్ సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పాక్ తూటాలకు ల్యాన్స్ నాయక్ సందీప్ థాపా (35) అనే భారత జవాన్ మరణించారని సమాచారం. నౌశేరా ప్రదేశంలో పాకిస్థాన్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శనివారం పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో భారత జవాన్లకు గాయాలయ్యాయి.

అప్రమత్తం అయిన భారత్ సైనికులు వెంటనే పాకిస్థాన్ సైనికులపై విరుచుకుపడటంతో నలుగురు పాక్ సైనికులు మృతి చెందారు. సరిహద్దు ప్రాంతంలో రెండు వైపుల నుంచి ఎదురు కాల్పులు జరిగాయి. గత కొన్ని రోజుల క్రితం రాజౌరి జిల్లాలో ఇదే రీతిలో పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు మరణించారు. భారత ప్రభుత్వం కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటినుంచి పాకిస్థాన్ ఏదో ఒక విధంగా భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే విమాన, రైలు సర్వీసులు రద్దు చేసుకున్న పాకిస్థాన్ దొడ్డి దారిలో భారత్ సైనికుల మీద కాల్పులు జరుపుతున్నది. పాక్ కు భారత్ సైనికులు సరైన రీతిలో సమాధానం ఇస్తున్నారు.