యువకుడి చేతిపై పురుషాంగాన్ని పుట్టించారు.. హైదరాబాద్ వైద్యుల ఘనత

News Published On : Saturday, February 8, 2025 11:38 AM

యువకుడి చేతిలో పురుషాంగాన్ని పుట్టించి దాన్ని అవసరమైన స్థానంలో విజయవంతంగా అమర్చారు హైదరాబాద్‌ మెడికవర్‌ ఆసుపత్రి వైద్యులు. బాల్యంలో ప్రమాదవశాత్తు పురుషాంగాన్ని కోల్పోయిన సోమాలియాకు చెందిన యువకుడికి (20) వైద్యులు అత్యాధునిక పద్ధతులతో కొత్త జీవితం ఇచ్చారు. ఈ సమగ్ర చికిత్స ద్వారా అతడి చేతిపై పురుషాంగాన్ని అభివృద్ధి చేసి, తర్వాత శస్త్రచికిత్స ద్వారా తన శరీరంలోని సహజ స్థితికి అనుసంధానం చేశారు.

మొదట అతడి మూత్ర విసర్జన సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు. తర్వాత అతడి శరీరంలోని వివిధ భాగాల నుంచి కండరాలు, నరాలు, రక్తనాళాలను సేకరించి, పురుషాంగాన్ని మళ్లీ అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలో, మైక్రోవాస్క్యులర్‌ సర్జరీ సాంకేతికతను ఉపయోగించారు. తొడ, పొట్ట, మోచేతి భాగాల నుంచి అవసరమైన కణజాలాలను సేకరించి, “రేడియల్‌ ఆర్టెరీ ఫోర్‌ ఆర్మ్‌ ఫ్లాప్‌” విధానంలో పురుషాంగాన్ని అభివృద్ధి చేశారు. దీనిని ముందుగా అతడి చేతిపై పెంచి, పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత శస్త్రచికిత్స ద్వారా శరీరంలోని సహజ స్థానంలో అమర్చారు. శస్త్రచికిత్స తర్వాత యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. అతడికి పినైల్‌ ఇంప్లాంట్‌ ఏర్పాటు చేయడంతో, ఇప్పుడు సాధారణ వ్యక్తిలా నిలబడి మూత్ర విసర్జన చేయగలుగుతున్నాడు. వైద్యుల ప్రకారం, అతడికి స్పర్శ సామర్థ్యం తిరిగి వచ్చింది, అలాగే సాధారణ దాంపత్య జీవితం కూడా గడపగలుగుతాడు.