రేవతి కుటుంబానికి 50 లక్షలు ప్రకటించిన పుష్ప టీం

News Published On : Monday, December 23, 2024 11:18 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 'పుష్ప 2' చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అండగా నిలిచింది.

ఈ మేరకు రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించింది. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత నవీన్.. రూ.50 లక్షల చెక్కును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి తండ్రి భాస్కర్కు అందజేశారు. బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాగా, ఈ నెల 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాలుడు శ్రీతేజ్ పేరిట ఓ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా సాయం అందించి బాలుని భవిష్యత్తుకు అండగా నిలవాలని భావిస్తున్నట్లు సమాచారం.