ఏపీ పోలీసుల విచారణకు రాం గోపాల్ వర్మ!

News Published On : Friday, February 7, 2025 07:43 AM

చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, పవన్ కల్యాణ్ లను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ సినీ దర్శకుడు రాం గోపాల్ వర్మపై గతేడాది ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన శుక్రవారం (ఫిబ్రవరి 7) ఏపీ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆర్జీవీ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపిన ఏపీ పోలీసులు ఈ నెల 4న విచారణకు రావాలని పేర్కొన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన షూటింగ్‌ ఉందని, అందుకే తాను విచారణకు రాలేనని వర్మ సమాధానమిచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తానని రాంగోపాల్‌వర్మ చెప్పినట్లు సమాచారం. ఇందుకు పోలీసులు అనుమతించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున ఆర్జీవీ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నారని సమాచారం. 

వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్‌, తదితరులపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగయ్య ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాంగోపాల్ వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో రెండు సార్లు విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆర్జీవీ విచారణకు హాజరుకాలేదు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఆయనకు ముందస్తు బెయిల్‌ మంజూరైంది. అయితే పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని, పోలీసులు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని ఆర్జీవీకి హైకోర్టు ఆదేశించింది.