ఎంపీ మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

News Published On : Monday, April 7, 2025 02:53 PM

వైసీపీ సీనియర్‌ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో సుప్రీంకోర్టు ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ సీఐడీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గత నెలలో హైకోర్టును మిథున్‌రెడ్డి ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ సమయంలో సీఐడీ తరుఫు న్యాయవాది మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని హైకోర్టుకు తెలియజేశారు. ఎంపీ మిథున్‌రెడ్డిని నిందితుడిగా పేర్కొనలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. మరోవైపు.. మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయనే ప్రచారం జరిగిన తరుణంలో ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయడం. ఆ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరగడంతో పాటు తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...