మారని శ్రీతేజ్ పరిస్థితి.. ఇక అంతేనా..

News Published On : Friday, January 31, 2025 02:36 PM

దేశవ్యాప్తంగా సంధ్య థియేటర్‌ ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని గురించి దాదాపు అందరూ మర్చిపోయారు. కానీ, ఆ ఘటనలో నష్టపోయిన భాస్కర్‌ కుటుంబాన్ని మాత్రం అది ఇంకా వెంటాడుతూనే ఉంది భార్య రేవతిని కోల్పోయిన భాస్కర్‌ తీవ్రంగా గాయపడిన కుమారుడు శ్రీతేజ్‌ను బ్రతికించుకునేందుకు, మామూలు మనిషిని చేసుకునేందుకు తపిస్తున్నారు. శ్రీతేజ్‌ చికిత్స విషయంలో ప్రభుత్వంగానీ, పుష్ప2 టీమ్‌గానీ ఎన్ని హామీలు ఇచ్చినా, ఎంత సహాయం చేసినా అతను సాధారణ స్థితికి రాకపోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఘటన జరిగిన రోజు వెంటనే శ్రీతేజ్‌ను హాస్పిటల్‌కి తరలించారు.

అప్పటికే అతను కోమాలోకి వెళ్లిపోయి ఉండడం, చికిత్సకు అతని శరీరం సహకరించకపోవడంతో ఆ కుర్రాడికి ఏం జరుగుతుందోనని అంతా భయపడ్డారు. వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో స్పృహ తప్పి పడిపోయిన శ్రీతేజ్‌ను గమనించిన పోలీసులు దగ్గరకి వెళ్లి చూడగా అతని ఊపిరి ఆగిపోయిందని గుర్తించారు. వెంటనే అతనికి సీపీఆర్‌ చేయడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకోగలిగాడు. ఆ క్షణమే అతన్ని కిమ్స్‌ హాస్పిటల్‌కి తరలించారు.

ఆరోజు నుంచి అక్కడి వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయినా ఫలితం మాత్రం కనిపించడం లేదని సమాచారం. మొదట్లో ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకు సాధారణంగానే ఊపిరి తీసుకుంటూ ఉండడంతో వెంటిలేటర్‌ను తొలగించారు. ఊపిరి తీసుకునే స్థాయికి వచ్చాడు తప్ప అంతకుమించి ఏమీ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు రెండు నెలలుగా కళ్లు తెరవలేదు, నోరు విప్పి మాట్లాడలేదు. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అర్థంకాని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం ముక్కుకి అమర్చిన సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్‌ రూపంలో ఆహారం అందిస్తున్నారు. శ్రీతేజ్‌ కళ్లు తెరిస్తే చూడాలని, అతను మాట్లాడితే వినాలని తండ్రి భాస్కర్‌, చెల్లెలు శాన్విక ఎదురుచూస్తున్నారు. శ్రీతేజ్‌ పూర్తిగా కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని, అవసరమైతే విదేశాలకు సైతం తీసుకెళ్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ప్రస్తుతం శ్రీతేజ్‌ ఆరోగ్య స్థితిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.