Breaking: మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్ లో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. మణిపుర్ గవర్నర్ సమర్పించిన నివేదికతోపాటు ఇతర నివేదికల సమాచారాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ రాజ్యాంగబద్ధ పాలన కొనసాగించే పరిస్థితి లేదనే అంచనాకు వచ్చామని, ఈ నేపథ్యంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 అధికారాలు ఉపయోగించి మణిపుర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదేశాల్లో పేర్కొన్నారు.
శాసనసభ సమావేశాలకు ముందే ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఆ వెంటనే సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆదేశాలిచ్చారు. అనంతరం తదుపరి ముఖ్యమంత్రిపై రాష్ట్ర భాజపా నేతలు పార్టీ అధిష్ఠానంతో సంప్రదింపులు జరిపారు. సీఎం అభ్యర్థిపై రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో రాష్ట్రపతి పాలన వైపే కేంద్రం మొగ్గుచూపింది.