విశాఖలో ఏం జరుగుతోంది.. హాస్టల్ బాలికలకు మత్తు మందు

News Published On : Friday, January 24, 2025 09:00 AM

విశాఖపట్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న విశాఖ వ్యాలీ స్కూల్‌కు సమీపంలోని ప్రభుత్వ బాలికల వసతిగృహంలో బుధవారం సాయంత్రం ఐదుగురు బాలికలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. తమను హింసిస్తున్నారని, నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌ గోడదూకి రోడ్డుపైకి వచ్చారు. హాస్టల్‌ సూపరింటెండెంట్ సునీత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ద్వారకా ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, ఆరిలోవ సిఐ మల్లేశ్వరరావు అక్కడకు చేరుకుని బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారు లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు. 

విషయం తెలుసుకున్న రూరల్‌ తహసీల్దార్‌ పాల్‌కిరణ్‌ అక్కడకు చేరుకుని, సూపరింటెండెంట్‌ నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన ఏసీపీ, ఆరిలోవ సీఐతో చర్చించారు. వీరంతా బాలికలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు శాంతించలేదు. మరోపక్క.. తహసీల్దార్, చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్‌ వచ్చి బతిమాలినా ఆ బాలికలు ససేమిరా అన్నారు.