చంద్రబాబు హత్యకు ప్లాన్ అందుకే : మావోయిస్టు చలపతి

News Published On : Wednesday, January 22, 2025 04:44 PM

2003లో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోలకు వ్యతిరేకంగా పాలసీలు తీసుకొచ్చారు. తాను మావోలకు వ్యతిరేకినని చెబుతూ వచ్చారు. దాంతో మావోయిస్టు నేత చలపతి చంద్రబాబును టార్గెట్ చేసారు. మావోలకు వ్యతిరేకంగా గ్రే హౌండ్ బలగాలను రంగంలోకి దింపడంతో చలపతి పగ పెంచుకున్నాడు. ఎవరినైనా సులువుగా టార్గెట్ చేసి చంపేసే చలపతి గ్యాంగ్ చంద్రబాబు పెట్టిన కొత్త నిబంధనల వల్ల కొందరు దొరికిపోవడం, మరికొందరు ఎన్‌కౌంటర్లలో చనిపోవడం జరిగాయి. చలపతి మాత్రం తప్పించుకోగలిగాడు. అదే సమయంలో అక్టోబర్ 1న చంద్రబాబు నాయుడు అలిపిరి వైపు నుంచి వెళ్తారనే సమాచారంతో ఆ ప్రాంతంలో ల్యాండ్ మైన్స్ ఏర్పాటుచేయించాడు. చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుతో పాటు మరో రెండు కార్లు పేలుడుకు గురయ్యాయి. చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి చంద్రబాబుకు కమాండోల ద్వారా భద్రత కల్పిస్తున్నారు. 

టీడీపీకి చెందిన ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు, మాజీ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సివారి సోమాలను కాల్చి చంపింది కూడా చలపతి గ్యాంగే. 2018లో వారు ఈ హత్యలకు పాల్పడ్డారు. అప్పటి నుంచి చలపతిపై నిఘా పెరిగింది. 2016లోనే చలపతి, అరుణలు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారని వార్తలు వచ్చాయి. కానీ వారు అప్పుడు చావలేదు. మూడు రోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో మొత్తానికి చలపతి చనిపోవడంతో కేంద్రం ఊపిరి పీల్చుకుంది. అయితే ఆయన భార్య అరుణ మాత్రం తప్పించుకున్నారని తెలుస్తోంది.