China Artificial Sun: కృత్రిమ సూర్యుడిని తయారు చేసుకున్న చైనా 

Offbeat Published On : Wednesday, January 27, 2021 01:00 PM

china, Dec 10: సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టుగా చైనా  తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది.  తమ దేశ శాస్త్రవేత్తలు కృత్రిమ సూర్యుడిని విజయవంతంగా తయారు చేసినట్లు మంగళవారం చైనా ప్రభుత్వ మీడియా ప్రకటించింది. ఈ సూర్యుడి పేరు హెచ్‌ఎల్‌-2ఎమ్‌ టోకామాక్ రియాక్టర్. ఇది చైనాలో అతి పెద్ద, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధనా పరికరమని.. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టుల అంచనా.

చైనా తయారు చేసిన కృత్రిమ సూర్యుడు అత్యంత శక్తివంతమైన మాగ్నెటిక్ ఫీల్డ్‌ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ న్యూక్లీయర్‌ గుండా వేడి ప్లాస్మాను విచ్చిన్నం చేసి దాని ద్వారా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్(అసలు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే 10 రెట్లు ఎక్కువ) ఎనర్జీని విడుదల చేయగలదని చైనా ‘పీపుల్స్ డైలీ’ వెల్లడించింది. ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తున్నందున దీన్ని ‘ఆర్టిఫిషియల్ సన్’గా పిలుస్తున్నట్లు స్పష్టం చేశారు.

అయితే సూర్యుడి పరమాణు కేంద్రంలో విపరీతమైన సూపర్ పవర్ ఉంటుంది. అణువులను విచ్ఛిన్నం చేస్తే దాని నుంచి విపరీతమైన ఎనర్జీ విడుదలవతుంది. అందుకే ఈ రియాక్టర్‌ ద్వారా చైనా పరిశోధకులు అదే చేశారు. కాగా ఈ రియాక్టర్ వాయువ్య చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది. 2019లోనే చైనా దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకే చైనా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. 

2006 నుంచి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారీపై చైనా సైంటిస్టులు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ కూడా ప్రపంచంలోనే అతి పెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేస్తోంది. అది 2025 నాటికి పూర్తికానుందని ప్రాన్స్‌ సైంటిస్టులు భావిస్తున్నారు