Fact Check: వ్యాక్సిన్ తీసుకున్నవారు మనుషుల్ని చంపి తింటున్నారా..వార్తలో నిజమెంత? 

Offbeat Published On : Friday, February 19, 2021 12:00 PM

కోవిడ్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న నేపథ్యంలో త్వరలో వ్యాక్సిన్ వస్తుందనే ఆశలు ప్రజలకు కొత్త ఊపిరిని అందిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ప్రపంచం ఆశిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ వార్తలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అందులో ఉన్న ఫేక్ న్యూస్ ఏంటంటే.. 

"బ్రేకింగ్‌ న్యూస్‌: తొలుత కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న రోగులు ఇతర పేషెంట్లను (Corona vaccine turns people into zombies) తింటున్నారు. దీంతో సదరు ఆస్పత్రులకు తాళాలు వేస్తున్నారు" అంటూ ఓ ఫొటో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన లాస్‌ ఏంజెల్స్‌లో జరిగినట్లుగా ఫొటో మీద పొందుపరిచారు. దీన్ని ప్రముఖ మీడియా ప్రసారం చేసినట్లు మార్ఫింగ్‌ చేశారు. అయితే ఈ వార్తను నమ్మిన కొందరు నెటిజన్లు దాన్ని ఇతరులకు షేర్‌ చేస్తున్నారు. ఈ స్క్రీన్ షాట్ లో ప్రముఖ న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ లోగో పెట్టారు. జోంబీ అపోకాలిప్స్" అనే క్యాప్షన్ తో దీన్ని వైరల్ చేస్తున్నారు. 

అయితే ఇది పచ్చి అబద్దమని ఇలాంటి వార్తలు (Don't fall for this morphed CNN visual) నమ్మవద్దని పలువురు చెబుతున్నారు. ఈ స్క్రీన్ షాట్ లోని చిత్రాన్ని బాగా గమనిస్తే.. అమెరికాలోని ఉత్తర ఫిలడెల్ఫియాలో టెంపుల్‌ యూనివర్సిటీ ఆస్పత్రిలో బుల్లెట్ల వర్షానికి గురైన బాధితులకు వైద్యం అందిస్తుండగా తీసిన ఫోటో అది. దాన్ని మార్ఫింగ్ చేసి వ్యాక్సిన్‌ తీసుకుంటే మనుషులు జాంబీలుగా మారి ఇతరులను తింటారని ప్రచారం చేస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో తీసిన ఈ ఫొటోను ప్రస్తుతం కరోనాతో కనెక్షన్‌ కలుపుతూ జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వ్యాక్సిన్‌ తీసుకుంటే నరమాంసం తినే జాంబీలుగా మారిపోతారనేది శుద్ధ అబద్ధం మాత్రమే! కాబట్టి ఇలాంటి ఫేక్‌ వార్తలను నమ్మకండి, ఇతరులకు షేర్‌ చేయకండి.
 
దీన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో వెతికితే ది న్యూయార్క్ టైమ్స్ యొక్క ఫిబ్రవరి 14, 2019 నాటి పత్రికలో ఇది ప్రచురితమైంది. "పునరుజ్జీవన ప్రయత్నాలు విఫలమైన తరువాత టెంపుల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ట్రామా బే" అనే శీర్షికతో ఈ చిత్రాన్ని ఉపయోగించారు. ఈ చిత్రంలో వైద్య విద్యార్థి ఎరిక్ కుర్రాన్ ట్రీట్మెంట్ చేస్తున్నది కనుగొనవచ్చు. ఈ వ్యాసంలో, ఎరిక్ తుపాకీ కాల్పుల బాధితులకు చికిత్స చేయడం, గుండె కొట్టుకునే అనుభవాన్ని వివరించాడు.