కరోనా ఊర్లోకి రాకూడదని ఒక రోజు ఊరిని వదిలి అడవిలో గడిపిన గ్రామస్థులు 

Offbeat Published On : Tuesday, February 2, 2021 12:00 PM

Hyd, Dec 14: ఊరి నుంచి కరోనా‌ను తరిమి వేయాలని గ్రామ దేవతను కోరుకుంటూ ఊరును వదిలి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామస్థులు ఒక రోజు అడవిలో గడిపారు. కరోనా మహమ్మారి నుంచి ఊరును కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ ముందు ఊరంతా కలసి గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి భోజనాలు చేశారు.లింగన్నపేటలో సుమారు ఆరు వేల జనాభా ఉండగా.. 1,400 నివాసాలు ఉంటాయి. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ గ్రామదేవతలకు పూజలు చేద్దామని, ఒకరోజంతా ఊరు వదిలి అడవుల్లోకి వెళ్లాలని అన్ని కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. 

అందరు ఈ నిర్ణయాన్ని అంగీకరించడంతో ఆదివారం దానిని అమలు చేశారు. దీనికి ముందు రెండురోజులుగా ఊళ్లోని ప్రతీవీధి, రహదారిని శుభ్రం చేశారు. అలాగే తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఊర్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన గ్రామదేవతల ప్రతిమలకు అంతా కలసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, రోగాలు దరిచేరకుండా కాపాడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని దేవతలను వేడుకున్నారు.

అనంతరం ఉదయం ప్రతీ ఇంటి నుంచి అందరూ ఆహార సామగ్రి, ఇతర వస్తువులు పట్టుకొని పొలాలు, అడవుల్లోకి పయనమయ్యారు. ఎవరికి వారుగా అక్కడ వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మళ్లీ గ్రామంలోకి అడుగుపెట్టారు. లింగన్నపేట వాసులు చేసిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.