డిసెంబర్ 31 అర్థరాత్రి వరకు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు ఓపెన్ చేసుకొండి : తెలంగాణ సర్కారు

Offbeat Published On : Wednesday, February 24, 2021 02:15 PM

Hyderabad, Dec 30: దేశంలో యూకే కొత్త వైరస్ స్ట్రెయిన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ లేఖలో కేంద్రం న్యూ స్ట్రెయిన్‌ కేసులు పెరగకుండా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇందుకోసం కేంద్రం రేపు, ఎల్లుండి జరిగే కొత్త సంవత్సర వేడుకలపై (New Year Celebrations) ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) న్యూ ఇయర్‌ కానుకగా రేపు అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. 

అలాగే బార్లు, క్లబ్‌లకు (bars and restaurants) డిసెంబర్‌ 31అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో పాటుగా కొత్త స్ట్రెయిన్ వైరస్‌ భారత్‌లోకి ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధాజ్ఞలు విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అర్థరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్‌ చేయడంపట్ల మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా బ్రిటన్‌లో కొత్త వైరస్‌ న్యూ స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీ వరకు ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్‌ కార్గోలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.