జగన్ హత్యకు ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర..?
జగన్ టార్గెట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు సంకేతాలు ఇచ్చారు. దీంతో వైసీపీ ఆయనపై ఎదురుదాడి ప్రారంభించింది. జగన్ ను టార్గెట్ చేసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఆయన్ను ఆత్మరక్షణలోకి నెట్టేందుకు సంచలన ఆరోపణలు చేసింది.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీకి చెందిన రాయచోటి మాజీ ఎమ్మెల్యే, జగన్ కు ఆప్తుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని హత్య చేయాలని ఏబీ వెంకటేశ్వర్ రావు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం కాకుండా ఇప్పుడు "రెడ్ బుక్" రాజ్యాంగం నడుస్తోందన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన దాడి ఒక ముందస్తు పథకం ప్రకారం జరిగిందని, దీనివల్ల టీడీపీ కుట్ర మరోసారి బహిర్గతమైందన్నారు. ఈ కుట్ర వెనుక అసలైన పాత్రదారులు బయటపడ్డారని తెలిపారు. జగన్‌పై హత్యాయత్నం కేసును నీరు గారేలా ముందుకు తీసుకువెళ్లారని, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లో జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్లడాన్ని ఆలోచించాల్సి ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జగన్‌పై గతంలో హత్యా యత్నం విఫలమైనా, ఈసారి పక్కా ప్రణాళికతో మరింత తీవ్రంగా ప్రయత్నించారని తెలిపారు. జగన్ పర్యటనల్లో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ఎన్ఐఏ ఛార్జిషీట్ లో ఇది సాధారణ దాడి కాదని, స్పష్టంగా హత్య ప్రయత్నమేనని పేర్కొన్నారని, గతంలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసిన అంశాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.
జగన్‌పై వ్యక్తిగత కక్షతోనే వెంకటేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారని, ఆయన హత్యాయత్నం చేసిన వ్యక్తితో చర్చలు జరపడం ఆందోళన కలిగిస్తున్న విషయమని అన్నారు.వివేకా హత్య కేసులో "మేమే చంపాం" అని ఒప్పుకున్న వ్యక్తిని బెయిల్‌పై బయటకు తెచ్చి తిప్పుతున్నారన్నారు. ఇందులో ప్రమేయం లేని వారిని ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.