మందు బాబులకు పండగలాంటి వార్త.. ఏపీలో మాత్రమే!

Politics Published On : Saturday, May 2, 2020 07:05 PM

కరోనా వైరస్ (కోవిడ్ 19) వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బంద్ అయిపోయాయి. ఏపీలో మాత్రం మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగానే మద్యం అమ్మకాలు నిలిచిపోయాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో మద్యం దుకాణాలను బంద్ చేసిన వైసీపీ ప్రభుత్వం.. తర్వాత కరోనా వ్యాప్తి వల్ల లాక్ డౌన్ విధించడంతో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగించింది. దీంతో గత రెండు, మూడు నెలలుగా తాగేందుకు మద్యం లేక మందుబాబులు అల్లాడిపోతున్నారు.

 ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం మందుబాబులకు శనివారం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వ అనుమతితో ఆదివారం (మే 3వ తేదీ) రాష్ట్రంలో 20 డిస్టెల్లరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం ఉత్పత్తికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని మార్గదర్శకాలు విడుదల చేశారు. మద్యం తయారీ సమయాల్లో కార్మికులు సామాజిక దూరం పాటించాలని, మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లు వేర్వేరుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్‌ నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కంపెనీల్లో కార్మికులు లిఫ్టులు ఉపయోగించరాదని ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.