రైలు టికెట్ల జారీలో ట్విస్ట్: వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఏం చేయాలి?

Politics Published On : Thursday, May 21, 2020 10:00 AM

కరోనా వైరస్ నివారణకి దేశవ్యాప్తంగా నాలుగోదశ లాక్‌డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే నెల 1 నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి అని రైల్వే శాఖ తెలిపింది. తొలిదశలో 200 రైళ్లను నడిపించబోతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఇదివరకే వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. ఆయా రైళ్ల టికెట్ల బుకింగ్ ఈ ఉదయం (21st మే 2020) 10 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందడాన్ని అడ్డుకోవడంలో భాగంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి టికెట్ల బుకింగ్‌లో భారీ మార్పులను చేసింది. ఈ మార్పులతోనే టికెట్లు బుకింగ్ ప్రారంభం కానుంది.

ఏజెంట్ల ద్వారా జారీ చేసే టికెట్లు చెల్లవని రైల్వే అధికారులు వెల్లడించారు.  ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను మాత్రమే అనుమతిస్తామని, అలాంటి వాటిపై మాత్రమే ప్రయాణించవచ్చని తేల్చి చెప్పింది. తత్కాల్, ప్రీమియం తత్కాల్ ద్వారా టికెట్లను జారీ చేయబోవట్లేదని వెల్లడించారు. కరెంట్ బుకింగ్ కూడా అందుబాటులో ఉండదని తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాతే వీటిని పునఃప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే టికెట్లు రద్దు అవుతాయి అని, వీరిని రైలు ఎక్కడానికి అవకాశం కల్పించట్లేదు అని అధికారులు అన్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉండే టికెట్లకి రీఫండ్ చెల్లిస్తామని అధికారులు తెలిపారు.