ఉత్తర కొరియా కొత్త అధ్యక్షుడు ఇతనే..!
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇప్పటివరకు లేనందున తరువాతి అధ్యక్షుడు ఎవరనే విషయంపై చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. కిమ్ చిన్న చెల్లెలు కిమ్ యో జంగ్ ఆ పదవికి సమర్థురాలిగా పలు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే పురుషాధిక్యత కలిగిన ఉత్తర కొరియా లాంటి సమాజంలో ఒక మహిళకు అంతటి అధికారం అప్పగిస్తారా అన్నది అనుమానమేనన్న విశ్లేషణలు కూడా వినబడుతున్నాయి.
ఈ నేపథ్యంలో కిమ్ చిన్నాన్న కిమ్ ప్యాంగ్ ఇల్ (65) పేరు బయటికొచ్చింది. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ వారసుల్లో ప్యాంగ్ ఇల్ (కిమ్ చిన్నాన్న) చివరివాడు. ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షుడిగా ఆయనకే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ దేశంలోని కొందరు మేధావులు తమ అభిప్రాయన్ని చెప్పారు. ఆయన చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. దాదాపు నలభై ఏళ్ల అనంతరం రాజకీయంగా ఆయన పేరు వినిపిస్తుండటం గమనార్హం.