అందుకే టీడీపీ అల్లరి చేస్తోంది: రాపాక
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగని ప్రకటించిన తర్వాత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అధికారంలోకి వచ్చి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా అదే బాటలో నడుస్తూ రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాపాక మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. వారి సంక్షేమం కోసం సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అయితే టీడీపీ మాత్రం రైతులకు మేలు చేకూర్చే రైతు భరోసా కేంద్రాలు తదితర కీలక అంశాలపై చర్చ జరుగుతుంటే అల్లరి చేస్తోందని విమర్శించారు.
స్పీకర్ పట్ల టీడీపీ సభ్యుల ప్రవర్తన అనుచితంగా ఉందని... చేతులు ఊపుకుంటూ స్పీకర్‌ను కొడతామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాపాక మండిపడ్డారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచి.. సభను తప్పదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపడతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
రైతులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిన చరిత్ర చంద్రబాబుదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతుల రక్తం పీల్చిన జలగ చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘చంద్రబాబు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవచ్చన్నారు. ఉచిత విద్యుత్ అమలు చేసి చూపించిన ఘనత వైఎస్సార్‌ది. ప్రస్తుతం సీఎం జగన్ అడగకుండానే అన్నీ ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నాలుగు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు చేస్తున్నారు. ఈ కేంద్రాలు రైతుల పాలిట వరాలు’ అని పేర్కొన్నారు.