పెళ్లికూతుర్ని దాచినట్టు అని లోకేష్ మీద సెటైర్ వేసిన విజయసాయి రెడ్డి
అల వైకుంఠపురం సినిమాలో హీరో తాత, హీరోని ఉద్దేశిస్తూ అనే డైలాగ్ మీ నాన్న నిన్ను పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచిపెట్టాడు అని. నిజంగా అలా సీక్రెట్ గా దాచిపెడుతూ నారా లోకేష్ ని ఆయన తండ్రి చంద్రబాబు ఏపీకి తీసుకొచ్చినట్టు అనిపిస్తోంది అని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు చంద్రబాబు ఒక్కడే అన్నారు. తీరా ఏపీకి వచ్చేసరికి చినబాబు కూడా వచ్చేశారన్నారు. మరి దారి మధ్యలో పెయిడ్ ఆర్టిస్ట్ లు రెచ్చిపోయి రోడ్లపైకి వచ్చినప్పుడు చంద్రబాబు కనపడ్డారే కానీ, చినబాబు కనిపించలేదే.
పోనీ కారెనక కారు, ఇంకో కారులో ఉన్నాడనుకుందాం. కనీసం జనాన్ని చూసైనా లోకేష్ ఒక్కసారి తన చేయి అలా అలా ఊపాల్సింది కదా. అసలే రెండు నెలల తర్వాత ఏపీలో ఎంట్రీ ఇస్తున్నారు. ఏదో సినిమాలో చూపించినట్టు కిందకు దిగి నేలను ముద్దాడకపోయినా, విండో తీసి చేతులు ఊపితే బాగుండేది. చినబాబుకు ఈ ఆలోచన కూడా తట్టలేదా లేక కరోనా వస్తుందని నాన్నారు కార్లోనే కూర్చోమన్నారా ఏమీ లేకపోయినా మాస్క్ మూతికి కట్టుకుని రెండు వేళ్లూ చూపిస్తూ కాస్తో కూస్తో హడావిడి చేశారు చంద్రబాబు.
మరి చినబాబు ఎందుకు సీటుబెల్టు పెట్టుకుని లోపలే కూర్చున్నట్టు. కనీసం బైటకి తొంగి చూడలేదు, ఆయన ఫొటో కూడా ఎక్కడా బైటకు రాలేదు. బహుశా అద్దం తెరిస్తే కరోనా వస్తుందని భయపడ్డారేమో. అంత భయపడుతూ ఏపీలో అడుగుపెట్టడం ఎందుకు? ఈలోగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చినబాబుపై ట్విట్టర్ లో జోకులు పేల్చారు. వాటికి కూడా చోటా మోటా నాయకులు రియాక్ట్ అయ్యారు కానీ అసలు ఇంటికొచ్చిన తర్వాత కూడా లోకేష్ బాబు మీడియాకు మొహం చూపించలేదు. ప్రతి చిన్నదానికీ ట్విట్టర్ అప్ డేట్ ఇచ్చే లోకేష్ సొంత రాష్ట్రానికి వచ్చే విషయాన్ని అంత సీక్రెట్ గా ఎందుకు దాచినట్టు. అసలు ఏపీకి రావడానికి చినబాబుకి పర్మిషన్ ఉందా, లేదా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ సంగతి పక్కనపెడితే 2 నెలల పాటు రాష్ట్రాన్ని వదిలేసి, పొరుగు రాష్ట్రంలో అద్దాల మేడలో ఏసీ గదిలో ఎంచక్కా కూర్చున్న చంద్రబాబు.. మళ్లీ ఫ్రెష్ గా రాజకీయాలు చేయడానికి, ఓదార్పులు చేయడానికి ఏపీలో అడుగుపెట్టినప్పుడు మాత్రం తన సొంత మీడియాతో బాగానే కవరేజీ ఇప్పించుకున్నారు. అదేదో చంద్రమండల యాత్ర పూర్తిచేసినట్టు. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించి వచ్చినట్టు. చంద్రబాబుకు కవరేజీ ఇచ్చింది అతడి అను'కుల' మీడియా. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హెడ్డింగులు పెట్టి, ఏపీకి వచ్చే క్రమంలో ఒక్కో ఏరియా దాటుతుంటూ ఒక్కో హెడ్ లైన్ అతికిస్తూ బాబు మీడియా నిన్నంతా చేసిన అతిని వర్ణించడానికి మాటలు చాలవు.