MI Win IPL 2020 Trophy: వరుసగా ఐదవ టైటిల్‌ను ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్

Sports Published On : Tuesday, December 15, 2020 12:00 PM

హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68) అర్ధ శతకంతో దుమ్మురేపడంతో.. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ ఫైనల్లో (MI vs DC Highlights Dream11 IPL 2020 Final) ఢిల్లీ క్యాపిటల్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు  తిరుగులేదని మరోసారి నిరూపించింది. ముంబై ఇండియన్స్‌కు ఇది ఐదో ఐపీఎల్‌ టైటిల్‌ కావడం విశేషం. ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్‌ కిషన్‌( 33 నాటౌట్‌; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌) ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ (Delhi Capitals) నిర్ణీత 20 ఓవర్లలో 156/7 స్కోరు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్‌), రిషభ్‌ పంత్‌ (38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు. బౌల్ట్‌ (3/30) మూడు వికెట్లతో ఢిల్లీ వెన్నువిరవగా.. కల్టర్‌నైల్‌ (2/29), జయంత్‌ యాదవ్‌ (1/25) రాణించారు. టాస్‌ గెలిచిన ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్‌-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్‌ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బౌల్ట్‌ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్‌ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్‌ ధావన్‌(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో అయ్యర్‌-పంత్‌లు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ఈ జోడీ వికెట్లను ఆదిలోనే కోల్పోయమనే విషయాన్ని పక్కకు పెట్టి ఫ్రీగా బ్యాటింగ్‌ చేసింది. ఈ క్రమంలో పంత్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఢిల్లీ తేరుకుంది. పంత్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి ఔటయ్యాడు. కౌల్టర్‌ నైల్‌ వేసిన 15 ఓవర్‌ చివరి బంతికి హార్దిక్‌ క్యాచ్‌ పట్టడంతో పంత్‌ ఔటయ్యాడు. అటు తర్వాత హెట్‌మెయిర్‌(5) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్‌ బౌలింగ్‌లో హెట్‌మెయిర్‌ ఔటయ్యాడు. అయ్యర్‌ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును ఆదుకున్నాడు.ముంబై బౌలర్లలో బౌల్ట్‌ మూడు వికెట్లు సాధించగా  కౌల్టర్‌ నైల్‌ రెండు వికెట్లు తీశాడు. జయంత్‌ యాదవ్‌కు వికెట్‌ దక్కింది.

ముంబై (Mumbai Indians) టార్గెట్‌ను ఛేదించే క్రమంలో డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ ఆది నుంచి విరుచుకుపడి ముంబై స్కోరును పరుగులు పెట్టించారు. స్టోయినిస్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి డీకాక్‌(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రోహిత్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ జత కలిశాడు. ఈ జోడి 45 పరుగులు జత చేసిన తర్వాత సూర్యకుమార్‌(19; 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) రనౌట్‌ అయ్యాడు. అటు తర్వాత రోహిత్‌- ఇషాన్‌ కిషన్‌లు జోడి 47 పరుగులు జత చేసింది. ముంబై స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా రోహిత్‌ మూడో వికెట్‌గా ఔట్‌ అయ్యాడు. పొలార్డ్‌ (9), హార్దిక్‌ పాండ్యా (3) స్వల్ప స్కోర్లకే అవుటైనా.. ఇషాన్‌, క్రునాల్‌ మరో 8 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.

2013, 2015, 2017, 2019ల్లో  విజేతగా నిలిచిన  ముంబై   2020లోనూ ఛాంపియన్‌గా అవతరించి నయా చరిత్ర సృష్టించింది.