ఉద్యోగులు నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే: ఇన్ఫోసిస్‌

Technology Published On : Friday, March 7, 2025 05:03 PM

ఇన్ఫోసిస్‌ తాజాగా ఉద్యోగుల కోసం కొత్త హైబ్రిడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. సంస్థ టెక్నాలజీ టీమ్‌కు జారీ చేసిన మార్గదర్శకాలు ప్రకారం, ఉద్యోగులు నెలకు కనీసం 10 రోజులు ఆఫీస్‌కు హాజరు కావాలి. 2020లో కరోనా కారణంగా ప్రారంభమైన వర్క్‌ ఫ్రం హోమ్‌ పద్ధతిని పూర్తిగా తగ్గిస్తూ, హైబ్రిడ్‌ మోడల్‌ను బలోపేతం చేస్తోంది.  

ఇప్పటికే టీసీఎస్‌, విప్రో వంటి సంస్థలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు చర్యలు తీసుకున్నాయి. ఇన్ఫోసిస్‌ కూడా గతంలో వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని సూచించింది. అయితే, ఇప్పుడు మరింత కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. మార్చి 10 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.  

అటెండెన్స్‌ కోసం వినియోగించే మొబైల్‌ యాప్‌ ఇకపై డీఫాల్ట్‌గా వర్క్‌ ఫ్రం హోమ్‌ను ఆమోదించదు. 10 రోజుల హాజరు నిబంధనను పాటించని ఉద్యోగుల సెలవుల నుంచి తగిన రోజులను మినహాయిస్తారు. దీనిపై ఇన్ఫోసిస్‌ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.