రానున్న మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
ఏపిలో రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎన్డిఎంఏ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలెవరూ చెట్ల క్రిందకు వెళ్లవద్దని సూచించింది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీ పురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో రాబోయే మూడు రోజులు భిన్నవాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మూడు రోజుల పాటు ఓ వైపు ఎండ, మరోవైపు వానలు కురుస్తాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2- 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. అందువల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.