ప్రపంచపు తొలి సీఎన్జీ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్.. 226 కిమీల మైలేజ్

ఇండియన్ టూవీలర్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ అద్భుతం చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ స్కూటర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్దం చేసుకుంది. ఇందుకు తగిన సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. ‘భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025’ లో టీవీఎస్ తమ మొదటి సీఎన్జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. జుపిటర్ 125 సీఎన్జీ పేరుతో పరిచయం చేసింది. భారత్ మొబిలిటీ ఎక్స్పో వేదికగా ఆవిష్కరించిన ఈ స్కూటర్లోని కొన్ని ఫీచర్లను రివీల్ చేసింది.
టీవీఎస్ జుపిటర్ 125 సీఎన్జీలో స్కూటీలో 124.8సీసీ కెపాసిటీ గల సింగిల్ సిలిండర్ ఎయిర్- కూల్డ్ బై- ఫ్యూయల్ ఇంజన్ కలదు. ఇది దాదాపు 7.2 హార్స్ పవర్ మరియు 9.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంటిన్యూయస్ వేరిబుల్ ట్రాన్స్ మిషన్ ఈ స్కూటర్లో కలదు. టాప్ స్పీడ్ గంటకు 80.5 కిలోమీటర్లు. రెండు రకాల ఇంధన సదుపాయాలు ఉన్నాయి. 2 లీటర్ల పెట్రోల్ ట్యాంకుతో పాటు 1.4 కిలోల సామర్థ్యం గల సీఎన్జీ సిలిండర్ స్టోరీజ్ ఉంది. స్కూటర్ ముందు భాగంలో ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ద్వారా పెట్రోల్ నింపుకోవచ్చు. సీటు వద్ద సీఎన్జీ ఇంధనం నింపుకోవచ్చు.
సీఎన్జీ, పెట్రోల్ రెండింటి సామర్థ్యంతో 226 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది. మెటల్ మాక్స్ బాడీతో జూపిటర్ 125 సీఎన్జీని తీసుకురానున్నారు. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, ఆల్-ఇన్-వన్ లాక్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్-ఇంజెక్షన్, ఇంటెలిగో టెక్నాలజీతో వస్తోంది. టీవీఎస్ జూపిటర్తో పాటు ఇథనాల్‌తో నడిచే రైడర్ 125 ను కూడా టీవీఎస్ ఆవిష్కరించింది. ఐక్యూబ్ విజన్ కాన్సెప్ట్ స్కూటీ మరియు అపాచీ ఆర్టీఎస్ఎక్స్ను కూడా ఇదే వేదిక మీద ఆవిష్కరించింది.