షాపు ముందు కూర్చోవద్దని వారించిన వృద్ధుడు.. గుద్ది చంపేసిన యువకులు

62 ఏళ్ల ఓ వృద్ధుడు తన దుకాణం ముందు కూర్చోవద్దని వారించినందుకు కొందరు యువకులు అతడిపై దాడి చేసి చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఓల్డ్ సిటీలో చోటు చేసుకుంది. కాంచన్బాగ్ పీఎస్ పరిధిలోని బాబా నగర్లో జాకీర్ ఖాన్ (62) కిరాణా దుకాణం నడుపుతున్నాడు. ఆ పక్కనే పాన్ షాప్ ఒకటి ఉంది. దీంతో కొందరు యువకులు బుధవారం రాత్రి ఆ షాప్ ముందు కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వెంటనే జాకీర్ ఖాన్ బయటకు వచ్చి తన షాపు ముందు కుర్చీలు తీయాలని వారితో వారించాడు.
కొందరు అక్కడ నుంచి పైకి లేచి పక్కకు వచ్చేశారు. ఇంకొందరు అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో జాకీర్ ఎంత చెప్పినా వారు లేవలేదు. ఈ క్రమంలోనే ఓ యువకుడు ఆ వృద్ధుడిపై దాడి చేశాడు. మొదటిగా అతడి చెంపపై గట్టిగా కొట్టాడు. అనంతరం అదే యువకుడు జాకీర్ ముఖం, ఛాతిపై బలంగా గుద్దాడు.
కింద పడిపోయిన ఆ వృద్ధుడిని కొందరు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. జాకీర్ కు అప్పటికే ఓపెన్-హార్ట్ సర్జరీ జరగడంతోనే ఈ దాడిలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న కాంచన్బాగ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.