భర్తకు దూరంగా ఉంటున్న సొంత చెల్లినే... మానవ మృగంలా..

బీమా డబ్బులు పొందేందుకు సొంత చెల్లెలిని అన్న హత్యచేసిన ఘటన ప్రకాశం జిల్లా కాటూరివారిపాలెం సమీపంలో చోటుచేసుకొంది. 1.13 కోట్ల పరిహారం కోసం ఈ ఘాతుకానికి సొంత అన్నేచెల్లెల్ని చంపాడని తేలింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరగగా రోడ్డుప్రమాదంగా కేసు నమోదైంది. అనంతరం పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలింది. కేసు వివరాలను పొదిలి సీఐ వెంకటేశ్వర్లు మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడుకు చెందిన మాలపాటి అశోక్‌రెడ్డి, సంధ్య అన్నాచెల్లెళ్లు. సంధ్య (25) కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా పునుగోడులోని అన్న అశోక్‌రెడ్డితో కలిసి ఉంటోంది. అశోక్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో అప్పులు చేసి పీకల్లోతు ఆర్దిక కష్టాల్లోకి వెళ్ళాడు. ఒకవైపు భర్తకు దూరమై తన ఇంట్లో ఉన్న చెల్లెలు, మరోవైపు ఆర్ధిక ఇబ్బందులు అశోక్‌రెడ్డిని రాక్షుసుడిలా మార్చాయి. ఇటు చెల్లెల్ని వదిలించుకోవడమే కాకుండా ఆర్ధికంగా లబ్ది పొందవచ్చన్న దురాలోచనలతో కుట్రకు ప్లాన్ చేసాడు.
చెల్లెలి పేరుతో పలు ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆమెకు రూ.1.13 కోట్ల వరకు జీవిత భీమా చేయించాడు. ఆపై ఆమెను చంపేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరిస్తే బీమా సొమ్ముతో అప్పులు తీర్చవచ్చని స్కెచ్ వేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెల్ని ఒంగోలులోని ఆసుపత్రిలో చికిత్స పేరుతో తీసుకెళ్ళాడు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా దారి మద్యలో చెల్లెలు సంధ్యకు మత్తుబిళ్ళలు ఇచ్చి ఆపస్మారక స్థితికి వెళ్ళేలా చేశాడు. కాటూరివారిపాలెం దగ్గర కారును చెట్టుకు ఢీకొట్టి యాక్సిడెంట్ అయినట్టు నమ్మించాడు. మత్తులో ఉన్న చెల్లెలు గొంతునులిమి చంపేశాడు. తనకు స్వల్ప గాయాలయ్యాయని గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. కారు యాక్సిడెంట్‌లో తన చెల్లెలు సంధ్య చనిపోయినట్టు నమ్మబలికిన అశోక్‌రెడ్డి ఆ తరువాత పోస్టుమార్టంలో అసలు నిజం బయటపడుతుందని భయపడ్డాడు. తన స్నేహితుడు మాలకొండారెడ్డికి ఈ విషయం చెప్పి సాయం చేయమని కోరాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం తన చెల్లెలు సంధ్య యాక్సిడెంట్ కారణంగా చనిపోయిందని చిత్రీకరించేందుకు పోస్టుమార్టం విధుల్లో ఉన్న ఆసుపత్రి ఉద్యోగికి 3 లక్షలు లంచం ఇచ్చాడు. అనుకున్న ప్రకారం సంధ్య అవయవాలను మార్చి రిపోర్ట్ పంపేలా చేశాడు. కొన్ని అనుమానాలు ఉన్నాయన్న కారణంగా వైద్యులు తాత్సారం చేశారు. కొన్నాళ్ళు గడిచిన తరువాత పోస్టుమార్టం రిపోర్ట్ కోసం అశోక్‌రెడ్డి వైద్యులను వత్తిడి చేయడం ప్రారంభించాడు. అశోక్‌రెడ్డి ప్రవర్తనపై పోస్టుమార్టం చేసే వైద్యులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అశోక్‌రెడ్డిపై నిఘాపెట్టారు. అశోక్‌రెడ్డికి తెలియకుండా విచారణ ప్రారంభించారు. పోలీసుల విచారణలో అశోక్‌రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా భీమా డబ్బుల కోసం చెల్లెల్ని హత్యచేసినట్లు తేలడంతో అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అశోక్‌రెడ్డికి సహకరించిన అతని స్నేహితుడు మాలకొండారెడ్డి, లంచం తీసుకున్న ఆసుపత్రి ఉద్యోగి యూసుఫ్‌ల కోసం గాలిస్తున్నట్టు పొదిలి సిఐ టి. వెంకటేశ్వర్లు తెలిపారు.