పోసానిపై కేసులు: రోజుకో చోటకు తరలింపు.. ఏపీ యాత్ర తప్పదా..?

వైసీపీ మద్దతుదారు, సినీనటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు ఇప్పట్లో తేలేలా లేవు. రోజుకో పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి ఆదోని తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దూషించిన ఘటనలో కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్స్టేషన్లో పోసానిపై కేసు నమోదైంది. మంగళవారం మధ్యాహ్నం ఆదోని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు చేరుకొని పోసానిని అప్పగించాలని జైలు అధికారులను కోరారు. వైద్య పరీక్షల అనంతరం అతన్ని కర్నూలు జిల్లా పోలీసులు ఆదోని తీసుకెల్లాలని భావించినా అక్కడ మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో కర్నూలులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. 18 రోజుల రిమాండ్ విధించడంతో కర్నూలు కేంద్ర కారాగారానికి తరలించారు. పోసానిపై గతేడాది నవంబర్ 14న ఫిర్యాదు చేయడంతో, FIR NO. 119/ 2024 పోలీసులు కేసు నమోదు చేశారు.
పోసానిపై వరుస కేసుల నేపథ్యంలో పాటు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులపైనా పోలీసులు ఫోకస్ పెడుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. తాజాగా నరసరావుపేట టూ టౌన్ సిఐ హేమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించేందుకు పోలీసులు వచ్చారు. అదే సమయంలో అల్లూరి జిల్లా, అనంతపురం రూరల్ పోలీసులు కూడా పోసాని కోసం పీటీ వారెంట్లతో వచ్చారు. దీంతో పోసాని కృష్ణమురళికి ఏపీ యాత్ర తప్పేలా లేదని వాపోతున్నారు. ఎక్కడికక్కడ కేసులు ఉన్నా పీటీ వారెంట్లపై ఆయన్ను ఆయా స్టేషన్లకు తీసుకెళ్లబోతున్నారు. ఇంకా చాలా చోట్ల వారెంట్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.