12 మేకులతో యువతి మృతదేహం.. నర బలినేనా?

బీహార్ లో నలంద జిల్లాలోని హర్నాట్ బ్లాక్‌లో రోడ్డు పక్కన బూడిదతో కప్పిన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ మహిళ అరికాళ్లకు 12 మేకులు కొట్టి ఉన్నాయి. మరణించిన మహిళ వయస్సు 25 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఏదైనా ముఢనమ్మకం కారణంగా హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన బీహార్ అసెంబ్లీలోనూ తీవ్ర చర్చకు దారి తీసింది.
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు ఆమె కుడి చేతికి సెలైన్లు ఎక్కించే ఇంట్రావీనస్ (IV) ఇన్ఫ్యూషన్ ఉన్నట్లుగా గుర్తించారు. దాంతో ఆమె ఏదైనా అనారోగ్యానికి గురై వైద్యం చేయించుకుంటూ మరణించిందా? లేదా ఆసుపత్రి నుంచి తీసుకువచ్చి క్షుద్రపూజలకు వినియోగించారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ మహిళ మృతి ఆ ప్రాంతంలోని ప్రజల్లో భయాందోళనలు కలుగజేసింది. ఆమెను హత్య చేసిన తర్వాత మేకు కొట్టారా లేదా తర్వాత కొట్టారా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వైద్యశాలకు తరలించారు. తీవ్ర చర్చనీయాంశమైన ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. NH-471 పక్కన ఈ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రాంతం చండి పోలీస్ స్టేషన్ పరిధిలోని చండి-హర్నాట్ గ్రామ పరిధిలోకి ఓ గుంటలో పడేశారు. బుధవారం ఉదయం గ్రామస్తుల సమాచారంతో పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె వివరాల్ని గుర్తించేందుకు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఆమె వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.