బిడ్డను కని ప్రాణాలొదిలిన పదో తరగతి అమ్మాయి

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పలమనేరు మండలం టి ఒడ్డూరుకు చెందిన పదో తరగతి విద్యార్థి స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది బాలికను గర్భవతిగా గుర్తించి డెలివరీకి ప్రయత్నం చేశారు. డెలివరీ టైమ్‌లో ఫిట్స్ రావడంతో బాలికను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మైనర్ బాలికకు ఆపరేషన్ చేసి బిడ్డను రక్షించే ప్రయత్నం చేశారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి మెటర్నటీ ఆసుపత్రికి తరలించారు. ప్రసవం తరువాత విద్యార్థిని మృతి చెందింది. బిడ్డ పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. టెన్త్ విద్యార్థిని ప్రసవం, మృతి ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఫోక్సో కేసు నమోదు చేసిన పలమనేరు పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మైనర్ బాలిక గర్భవతికి కారణం ఎవరో తెలుసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.