గుట్టుగా భర్తను లేపేసింది... చివరకు దొరికిపోయింది..

అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి మద్యం సీసాలో పురుగులమందు కలిపి భర్తను చంపేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన వివరాలను పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పేటచెరువుకు చెందిన పుట్టల నరేశ్ గతనెల 1న మృతి చెందాడు. కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అతడి తల్లి పుట్టల చుక్కమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు పేటచేరువు స్మశానంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి, పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు.
లభించిన ఆధారాల ఆధారంగా గద్దల సాంబశివరావు, తాటి నరేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో మృతుడు నరేశ్ భార్య రజితకు, ఈమె బావ గద్దల సాంబశివరావుకు మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో తన భర్త పుట్టల నరేశ్ అడ్డు తోలగించుకోవాలని రజిత, సాంబశివరావు ఇద్దరూ కలిసి పథకం పన్నారు. స్నేహితుడు తాటి నరేశ్ సహాయంతో ముందస్తు ప్లాన్ ప్రకారం పుట్టల నరేశ్ కు మద్యం బాటిల్ లో పురుగుల మందు కలిపి ఇచ్చారు. ఆ మద్యం తాగిన రజిత భర్త అస్వస్థతకు గురై చనిపోయాడు. నరేష్ తో పాటు అదే మద్యాన్ని సేవించిన పెటచెరువుకు చెందిన బొజ్జా వెంకటేశ్వర్లు ఆరోగ్యం కూడా క్షీణించింది. అది మద్యం మూలంగానే జరిగిందని అందరూ అనుకున్నారు. కానీ, అసలు విషయం తెలియడంతో నిందితులు గద్దల సాంబశివరావు, తాటి నరేశ్, పుట్టల రజితను పోలీసులకు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.