భర్త కళ్లెదుటే దారుణం.. ప్రాణాలు కోల్పోయిన భార్య

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏలూరు సుస్మితా డయాగ్నొస్టిక్ సెంటర్‌లో చోటు చేసుకుంది. ఏలూరు రూరల్ మండలం ప్రత్తి కోళ్ళంక గ్రామానికి చెందిన నల్లగచ్చు రామతులసమ్మకు గతంలో వైద్యులు పేస్ మేకర్‌ను అమర్చారు. గత కొన్ని రోజులుగా ఆయుష్ ఆస్పత్రిలో మహిళ డయాలసిస్ చేయించుకుంటోంది. ఈ క్రమంలో రామతులసమ్మకు ఎమ్మారై తీయించుకోవాల్సిందిగా వైద్యులు తెలిపారు. దీని కోసం ఏలూరులోని సుష్మిత డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్ళారు. ఎమ్మారై స్నానింగ్‌కు ముందు మెటల్ డిటెక్టర్‌తో మహిళకు చెక్ చేయకుండానే స్కానింగ్ మిషన్‌లోకి మహిళను పంపించారు. మిషన్‌లోకి వెళ్లిన వెంటనే రేడియేషన్ ప్రభావంతో రామతులసమ్మ కొట్టుమిట్టాడింది. చివరకు రేడియేషన్ ఎఫెక్ట్‌తో స్కానింగ్ మిషన్‌లోనే ప్రాణాలు విడిచింది.
స్కానింగ్ మిషన్‌లో భార్య ఉక్కిబిక్కిరి అవుతున్న విషయాన్ని భర్త కోటేశ్వరరావు గుర్తించాడు. వెంటనే స్కానింగ్‌ను ఆపాలని సిబ్బందిని కోరారు. అయినప్పటికీ సదరు ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. మహిళ స్కానింగ్ మిషన్‌లో కొట్టుమిట్టాతుండగానే స్కానింగ్‌ను కొనసాగించారు. దీంతో రేడియేషన్‌ను తాళలేక మహిళ మరణించింది. ఎమ్మారై స్కానింగ్ చేస్తున్న సమయంలోనే తన భార్య తన కళ్ళ ఎదుటే మృతి చెందిందని భర్త కోటేశ్వరరావు విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టేలా చేసింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం పట్ల కోటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని డయాగ్నొస్టిక్ సెంటర్ వద్ద భర్త ఆందోళనకు దిగారు.