అతడికి 28.. ఆమెకు 30.. వారి యవ్వారం తెలిసిపోతుందని..

28 ఏళ్ల యువకుడితో 30 ఏళ్ల మహిళకు సంబంధం ఉండగా వారి యవ్వారం బయట పడుతుందని పక్కింట్లో ఉంటున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేశారు. కేకలు వేయకుండా నోట్లో వస్త్రాలు కుక్కి చేతులు కట్టి రాడ్డుతో దాడి చేసారు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా గణపర్తిలో చోటు చేసుకుంది.
అనకాపల్లి జిల్లా గణపర్తికి చెందిన దీపిక అనే మహిళ మునగపాక ఎన్టీఆర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె ఇంటి పక్కనే రాజ్ కుమార్, సరిత దంపతులు నివాసం ఉంటున్నారు. రాజ్ కుమార్ అచ్యుతాపురంలోని ఓ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. భర్త డ్యూటీకి వెళ్లిన తరువాత రాజ్ కుమార్ భార్య సరిత తన ప్రియుడు శాంతిరాజ్‌ను ఇంటికి పిలిచేది. ఈ వ్యవహారం కాస్తా దీపిక గమనించినట్టు సరిత తెలుసుకుంది.
దీపిక ద్వారా తన యవ్వారం భర్తకు తెలిసిపోతుందేమోనని అనుమానంతో ఆందోళన చెందింది. ఈ విషయం ప్రియుడితో చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి రాత్రి పదిన్నర గంటల సమయంలో దీపిక ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె నోట్లో వస్త్రాలు కుక్కి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి. ఇనుప రాడ్డుతో దీపికపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇంతలో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన రాజ్ కుమార్ తన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెతికాడు. పక్కింట్లో శబ్దాలు రావడంతో వెళ్లి పరిశీలించాడు. అప్పటికే అక్కడ నుంచి సరిత, ఆమె ప్రియుడు శాంతిరాజ్ పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న దీపికను ఆసుపత్రికి తరలించారు. దీపిక ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు సరిత, ఆమె ప్రియుడు శాంతి రాజ్‌లను అరెస్టు చేశారు.