మలబద్ధకం పోవాలంటే వీటిని అస్సలు తినకండి

రోజంతా తినే ఆహారం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. సమతుల ఆహారం తీసుకుంటే కడుపు అంతా శుభ్రంగా ఉంటుంది. ఏది పడితే అది తినడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. ఆహారంలో ఫైబర్, నీరు, పోషకాలు అధికంగా లేకపోతే పేగు పనితీరు మందగిస్తుంది. నిజానికి తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీని వల్ల మలం గట్టిపడి మలబద్ధకం వస్తుంది. సరైన ఆహారం, క్రమం తప్పకుండా నీరు తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం వస్తుంది. అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చూస్తున్నారు.
ఫాస్ట్ ఫుడ్స్ : బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర జంక్ ఫుడ్స్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో అధిక మొత్తంలో కొవ్వు, ఉప్పు ఉంటాయి. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఈ ఆహారాలలో ఫైబర్ ఉండదు. వీటిని రెగ్యులర్ తినడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. ఈ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల పేగుల పనితీరు నెమ్మదిస్తుంది. ఇది కడుపులో గ్యాస్, ఉబ్బరానికి కారణమవుతుంది.
పాల ఉత్పత్తులు: పాలు, జున్ను, ఇతర పాల ఉత్పత్తులలో లాక్టోస్ ఉంటుంది. ఇది కొందరికి పడదు. వారి శరీరాలు సరిగా జీర్ణం చేసుకోలేవు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. లాక్టోస్ అసహనం ఉంటే పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. మలబద్ధకం తీవ్రమై ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
చిప్స్: బంగాళాదుంప చిప్స్ చాలా టేస్ట్‌గా ఉంటాయి. వీటిలో కొవ్వు అధికంగా, ఫైబర్ తక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. చిప్స్ ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది.
వైట్ రైస్ మలబద్ధకాన్ని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యంలో పొట్టు, ఊక తొలగిపోతాయి. దాంతో శరీరానికి ఫైబర్ అందదు. అయితే బ్రౌన్ రైస్ మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది.